అప్పుడే సామాన్యులకు న్యాయ వ్యవస్థపై నమ్మకం : మోదీ
దేశంలో ప్రధానమైన న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు చేపడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సును ప్రారంభమైంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అమృత కాలంలో న్యాయ వ్యవస్థపై మనం దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్కరికీ సులభంగా, త్వరతగతిన న్యాయం అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. దేశంలో న్యాయ విద్యను అంతర్జాతీయ ప్రమాణాలతో అందించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రస్తుతం కోర్టుల్లోని న్యాయ వ్యవహారాలన్నీ ఆంగ్ల భాషలోనే జరుగుతున్నాయి. సామాన్యులకు అర్థమయ్యేలా న్యాయ భాషను రూపొందించాల్సిన అవసరం ఉంది. కోర్టుల్లో స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే సామాన్యులకు న్యాయ వ్యవస్థపై నమ్మకం మరింత పెరుగుతుంది అని అన్నారు. సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు, జిల్లా కోర్టులు బలోపేతమవ్వాలని సూచించారు. సీఎంలు, హైకోర్టు సీజేలు డిజిటల్ ఇండియా ప్రగతిలో కలిసి రావాలని కోరారు.













