కోవిడ్ అనాథలకు అండగా మోదీ…. కీలక ప్రకటన

కోవిడ్ దేశాన్ని అల్లకల్లోలమే చేసింది. కుటుంబాలనూ కుంగదీసింది. ఆయా కుటుంబీకులను కోల్పోయి కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశా, నిస్పృహల్లో ఉండిపోతున్నారు. వీరందరూ ఓవైపు… చిన్నారులు మరోవైపు. కరోనా బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితి వర్ణనాతీతం. వారిని అక్కున చేర్చుకునే నాథుడే కరువయ్యాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారికి అండగా నిలబడింది. వారి భవిష్యత్తు దృష్ట్యా కీలక ప్రకటన చేసింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ 10 లక్షల రూపాయల కార్పస్ ఫండ్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. కోవిడ్ కారణంగా తలిదండ్రులను కోల్పోయిన అనాథల విషయంపై ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులను పీఎం కేర్‌ఫండ్ నుంచి ఇవ్వనున్నారు. ఉన్నత విద్యా కాలంలో వారి అవసరాలను తీర్చడానికి నెలవారీ స్టైఫండ్‌ను ఈ కార్పస్ ఫండ్ నుంచి కేటాయించనున్నారు. వారికి 23 ఏళ్లు వచ్చే సరికి వ్యక్తిగత, కెరీర్ అవసరాల నిమిత్తం ఆ కార్పస్ ఫండ్ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వాలని మోదీ నిర్ణయించారు. అంతేకాకుండా వారందరికీ ఉచితంగా విద్యనందించాలని కేంద్రం నిర్ణయించింది. ‘‘పిల్లలే దేశానికి పెద్ద ఆస్తి. వారే భవిష్యత్తు. వారి కోసం ఎంతైనా చేస్తాం. వారందర్నీ కాపాడుకుంటాం. అది మా బాధ్యత కూడా. వారి ఉజ్వల భవిష్యత్తు కోసమే ఈ పథకం’’ అని మోదీ వివరించారు.