పతంజలి కరోనా మందుకు కేంద్రం ఆదేశాల విరుగుడు…
వరుసగా పుట్టుకొస్తున్న కరోనా మందుల వెల్లువలో తాను సైతం అంటూ ముందుకు దూసుకొచ్చిన పతంజలి ఆయుర్వేద లిమిలెడ్కి కేంద్రం కళ్లెం వేసింది. తాజాగా తాము కరోనాకు మందు కనిపెట్టామంటూ రెండు అగ్రగామి ఫార్మా స్యూటికల్స్ సంస్థలు ప్రకటించి మార్కెట్లోకి విడుదల చేసిన విషయం విదితమే. అదే బాటలో మరికొన్ని కంపెనీలు సైతం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు సమాచారం. ఆంగ్ల మందుల సంగతలా ఉంచితే… తొలి దేశీయ, ఆయుర్వేద మందుగా పతంజలి సంస్థ సైతం తాము కరోనా చికిత్స ఔషధాన్ని ఆవిష్కరించామంటూ ప్రకటించింది. ఇది మీడియాలో పెద్ద యెత్తున ప్రచారమైంది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం పతంజలి మందు ప్రచారం పై అభ్యంతరం వ్యక్తం చేసింది.
అత్యుత్యాహంతో ఆయుర్వేద మందు విడుదలను ప్రకటించడం సరైంది కాదంటూ తప్పు బట్టింది. ఈ మందుకు సంబధించిన పూర్తి వివరాలు, క్లినికల్ ట్రయల్స్ జరిపించిన తీరు, మార్కెటింగ్ అనుమతి పొందారా వంటి విషయాలను తమకు తెలుపాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆయుష్ విభాగం పతంజలి సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.













