పార్లమెంట్ లో హైదరాబాద్ బిర్యానీ ఎంతో తెలుసా?
పార్లమెంట్ క్యాంటీన్లో సబ్సిడీ ఎత్తేసిన తర్వాత కొత్త ధరలతో మెనూ ఏర్పాటు చేశారు. రాబోయే బడ్జెట్ సెషన్లో రకరకాల ఆహార పదార్థాలను ఎంపీలకు వడ్డించడానికి సిద్ధం చేస్తున్నారు. అయితే వీటికి కొత్త ధరలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు నాన్ వెజ్ బఫే కోసం ఎంపీలు రూ.700 చెల్లించాల్సిందే. మెనూలో అత్యధిక ధర ఉన్నది ఇదే. ఒక అతి తక్కువగా ఒక చపాతీ ధరను రూ.3గా నిర్ణయించారు. ఇన్నాళ్లూ పార్లమెంట్ క్యాంటీన్లో హైదరాబాద్ మటన్ బిర్యానీ రూ.65కే ఇచ్చేవాళ్లు. ఇప్పుడు దాని ధర రూ.150కి చేరింది.
ఈ పెరిగిన ధరలు జనవరి 29 నుంచి అమల్లోకి రానున్నాయి. అదే రోజు పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. కొత్త ధరల ప్రకారం శాకహార భోజనానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఇక గతంలో రూ.12గా ఉన్న ఉడకపెట్టిన కూరగాయల ధరను రూ.50కి పెంచారు. ఈ క్యాంటీన్లో మొత్తం 58 ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ సబ్సిడీని ఎత్తేయడం వల్ల లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఏడాదికి రూ.8 కోట్లు మిగలనుంది. త్వరలోనే పార్లమెంట్ క్యాంటీన్లో సబ్సిడీని ఎత్తేస్తున్నట్లు జనవరి మొదట్లోనే స్పీకర్ ఓం బిర్లా చెప్పిన విషయం తెలిసిందే.













