13 రోజుల ముందే ముగిసిన పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. జనవరి 29న ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 న ముగియాల్సి ఉంది. కానీ 13 రోజుల ముందే ముగిశాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలున్న దృష్ట్యా సమావేశాలను వీలైనంత త్వరగా ముగించాలని కొందరు సభ్యులు స్పీకర్ను కోరారు. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్… 13 రోజుల ముందే ముగించారు. అయితే లోకసభ సమావేశాలు సంతృప్తిగానే జరిగాయని స్పీకర్ ఓం బిర్లా ట్విట్టర్ వేదికగా సంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్ ఓం బిర్లాకు కరోనా సోకడంతో ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాలేదు. మరోవైపు ఈ సమావేశాల్లో మొత్తం 20 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. అందులో 18 బిల్లులకు మోక్షం లభించింది. బీమా సవరణ బిల్లుతో పాటు ఢిల్లీ ఎల్జీకి మరిన్ని అధికారాలను కట్టబెట్టడం లాంటి కీలక బిల్లులకు సభ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి కోవింద్ ప్రసంగంతో బడ్జెట్ మొదటి సెషన్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మార్చి 8 న రెండో విడత సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర బడ్జెట్ పై 14.42 గంటలు చర్చలు జరిగాయి. ఇందులో 146 మంది సభ్యులు పాల్గొన్నట్లు ప్యానల్ స్పీకర్ భర్తృహరి ప్రకటించారు.
ఆసక్తికర సన్నివేశంతో ముగిసిన సమావేశాలు 9395318634
లోక్సభలో చివరి రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్లో లోక్సభ నేత రవ్నీత్ సింగ్ బిట్టూ ప్రధాని పై మండిపడ్డారు. పెట్రో పెంపులాంటి కీలక చర్చలు జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ సభలో లేకపోవడమేంటని తీవ్రంగా దుయ్యబట్టారు. తాము ప్రధానిని ఎక్కడ కలవాలి? బెంగాల్ ర్యాలీలో కలుసుకోవాలా? అంటూ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దీనిపై కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ స్పందించారు. బిట్టూ మాటలు సరికావని, ప్రధాని మోదీ కచ్చితంగా సభకు హాజరవుతారని ప్రకటించారు. అంతేకాకుండా ప్రజలకు కూడా మోదీ నిత్యం అందుబాటులోనే ఉంటారని ప్రకటించారు. కాంగ్రెస్ ఎంపీ బిట్టూ విరుచుకుపడుతున్న సమయంలోనే ప్రధాని మోదీ హఠాత్తుగా సభలోకి ప్రవేశించారు. దీంతో బీజేపీ సభ్యులు ‘భారత్ మాతాకీ జై… భారత్ మాతాకీ జై…’’ అంటూ నినాదాలు చేశారు.













