రిపబ్లిక్ డే వేడుకల్లో 10 మందికి పద్మ పురస్కారాలు
రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం పలువురు నిష్ణాతులకు పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో తెలుగువారు 10 మంది ఉన్నారు. భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులతోపాటు మహా సహస్రావధాని-ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు… విలక్షణమైన ‘12 మెట్ల కిన్నెర’ జానపద గాయకుడు మొగులయ్య, ప్రముఖ నాదస్వర విద్వాంసుడు గోసవీడు షేక్ హసన్ (మరణానంతరం), డోలు వాయిద్యకారుడు రామచంద్రయ్య, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి పద్మజా రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావులకు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులు, దర్శనం మొగులయ్య, రామచంద్రయ్య, పద్మాజా రెడ్డిలకు తెలంగాణ నుంచి… గరికపాటి, షేక్ హసన్, సుంకర వెంకట ఆదినారాయణ రావులను ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక చేశారు.
విదేశాల్లో ఉన్న తెలుగువారి ప్రతిభకు గుర్తింపుగా వారికి కూడా పద్మ అవార్డులను ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ అధిపతి సత్య నాదేళ్లపాటు మరో ఐటీ దిగ్గజమైన గూగుల్ సారథి సుందర్ పిచైకి కూడా ‘పద్మభూషణ్’ లభించింది.
పద్మజారెడ్డి
నాట్యకళతో ఐదు దశాబ్దాల అనుబంధం, కూచిపూడిలో ఎన్నో రకాల ప్రయోగాలు చేసి నాట్యకళకు వన్నె తీసుకువచ్చిన ప్రముఖ నర్తకి పద్మజారెడ్డికి పద్మ అవార్డు లభించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పాముర్రులో పుట్టారు. ప్రముఖ నర్తకీమణి శోభానాయుడు వద్ద శిక్షణ పొందారు. దేశ, విదేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చారు. శివహేల, భ్రూణ హత్యలు, కళ్యాణ శ్రీనివాస చరితం, అన్నమయ్య పద నర్తన శోభ, శ్రీకష్ణపారిజాతం, రాధే శ్రీకష్ణామత్, వజ్రభారతి, సీతాస్వయంవరం, సీజన్ ఆఫ్ ఫ్లవర్స్, నమస్తే ఇండియా, రామాయం వంటి ఇతివత్తంగా తీసుకుని కూచిపూడి నత్యప్రదర్శనలిచ్చారు. కూచిపూడి, భరతనాట్యం శైలిలో కాకతీయం పేరిట ప్రయోగాత్మకంగా నత్యరూపకాన్ని ప్రదర్శించారు. పదేళ్ల క్రితం పరిశోధన ప్రారంభించిన ఆమె సరికొత్త శాస్త్రీయ నత్యరూపకాన్ని ప్రేక్షకుల ముందు ప్రదర్శించారు. నాట్య రంగంలో విశేష ప్రతిభకు గాను ఆమెకు 1994లో నాట్య విశారద, 2015లో సంగీత నాటక అకాడమీ పురస్కారాలు దక్కాయి. 2006లో నాటి సీఎం వైఎస్ చేతుల మీదుగా కళారత్న అవార్డు, అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ఏఎన్ఆర్ గోల్డ్మెడల్లు అందుకున్నారు. 2005లో శ్రీకష్ణదేవరాయ వర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఆమెకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. నగరంలోని ప్రధాన వేదికలు రవీంద్రభారతి, శిల్పకళావేదిక, భారతీయ విద్యాభవన్, తెలుగు వర్సిటీ ఆడిటోరియం వంటి వేదికపై అనేక ప్రదర్శనలిచ్చారు.
షేక్ హసన్ సాహెబ్
భద్రాద్రి రామయ్య సన్నిధిలో నాదస్వర సుప్రభాత వాద్యంతో సేవలందించి, దేవస్థానం తొలి నాదస్వర ఆస్థాన విద్వాంసుడిగా సేవలందించిన ప్రముఖ నాదస్వర విద్వాంసులు షేక్ హసన్ సాహెబ్‌కు మరణాంతరం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం గోసవీడు గ్రామంలో 1930లో ఆయన జన్మించారు. చిలకలూరిపేట చిన మౌలా సాహెబ్ వద్ద సంగీత శిక్షణ పొందారు. భద్రాచలంతోపాటు యాదగిరి గుట్ట దేవస్థానంలోనూ నిలయ విద్వాంసుడిగా పనిచేశారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో అనేక కచేరీలు చేశారు. త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలలో నాదస్వరాన్ని వినిపించారు. ఆయనను 1962లో స్వర్ణ కంకణంతో సన్మానం, 2007లో త్యాగరాజ పురస్కారం అందుకున్నారు. 1950లో భద్రాద్రి దేవస్థానం తొలి నాదస్వర విద్వాంసులుగా బాధ్యతలు చేపట్టి 1996 వరకు పని చేశారు.
సకిని రామచంద్రయ్య
కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం. కోయతెగలోని డోలి ఉపకులానికి చెందిన సకిని రామచంద్రయ్య డోలు వాయిస్తే వీనులకు విందుగా ఉంటుంది. తన మాతృభాషలో కులాచారపు గీతాలు పాడుతూ తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్త్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో కోయ తెగల వంశ చరిత్రలను పారాయణం చేసే వారిలో బహుషా రామచంద్రయ్యే చివరి వ్యక్తి అని అంటారు. సమక్క సారక్క చరిత్ర, గరికామారాజు, పగిడిద్దరాజు, ఈరామరాజు, గాడిరాజు, బాపనమ్మ, ముసలమ్మ, నాగులమ్మ, సదలమ్మ తదితర ఆదివాసీ యోధుల కథలను ఆశువుగా గానం చేయడంలో ఆయన దిట్ట. డోలు వాయిస్తూ దైవకార్యాలు, జాతరలు, ఆదివాసీ పండుగలు, వివాహాదిశుభకార్యాల్లో డోలు వాయిస్తారు. మేడారం సమ్మక్క సారక్క జాతరలో రామచంద్రయ్య వాయిద్య నైపుణ్యమే ప్రత్యేకంగా కనిపిస్తుంది.
దర్శనం మొగిలయ్య
500 ఏళ్ల నాటి అత్యంత అరుదైన కిన్నెర వాయిద్య పరిజ్ఞానాన్ని నమ్ముిని వాయిస్తున్న దర్శనం మొగిలయ్య ప్రతిభకు గుర్తింపు లభించింది. ఏడేళ్ల క్రితం కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దమడూరుకు చెందిన డాక్టర్ రంగయ్య పీహెచ్డీ కోర్సులో భాగంగా మొగిలయ్య జీవితచరిత్రను ప్రచురించారు. ఫలితంగా అంతరించిపోతున్న కిన్నెర వాయిద్య కళను కాపాడుతున్న ఆయన్ను ప్రభుత్వం గుర్తించింది. ఉగాది పురస్కారంతో సన్మానించింది. అంతేనా.. ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో మొగిలయ్య జీవిత గమనాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. ఇక పవన్ కల్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్‌ను మొగలయ్యతో పాడిరచారు. ఈ పాటలో కిన్నెర వాయిద్యం పుట్టు పూర్వోత్తరాలు చెబుతూ మొగులయ్య ప్రోమోలో కనిపించారు. దీంతో మొగిలయ్య పేరు తెలుగురాష్ట్రాలలో ఒక్కసారిగా మారుమోగింది.
డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా
కొవిడ్ వ్యాక్సిన్ల అభివృద్ధిలో భారత్ సత్తాను చాటి కొవ్యాక్సిన్ టీకాను అతి తక్కువ కాల వ్యవధిలో తయారుచేసిన హైదరాబాదీ కంపెనీ ‘భారత్ బయోటెక్’ సారథులైన డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలను దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో మూడోదైన పద్మభూషణ్ వరించింది. వృత్తిరీత్యా వైద్యుడైన డాక్టర్ కృష్ణ ఎల్లా తన భార్య సుచిత్రతో కలిసి అమెరికా నుంచి తిరిగివచ్చి 1996 సంవత్సరంలో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ను స్థాపించారు. ఈ కంపెనీ హెపటైటిస్-బి, రొటా వైరస్, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు… చికున్‌గున్యా, జైకా వంటి వైరల్ వ్యాధులకు కూడా టీకాలు కనుగొంది. 123కుపైగా దేశాల ప్రజలను వ్యాధుల బారి నుంచి కాపాడి ఆరోగ్యవంతంగా జీవనం సాగించగల శక్తిని అందించింది. కంపెనీ ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలకు 300కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసింది. ఇటీవలే పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ కనుగొంది.













