బలపరీక్షకు 24 గంటల ముందు కీలక మలుపు తిరిగిన పుదుచ్చేరి రాజకీయం
పుదుచ్చేరి రాజకీయం గంట గంటకో మలుపు తిరుగుతోంది. బలపరీక్ష 24 గంటలు ఉన్నదనంగా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేశారు. ఒకరు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణన్ కాగా, మరొకరు డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్. వీరిద్దరూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీలకు ఝలక్ ఇచ్చారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సీఎం నారాయణ స్వామి సర్కార్ మైనారిటీలో పడిపోయింది. పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా, కాంగ్రెస్, డీఎంకే కూటమి+ స్వతంత్ర అభ్యర్థితో కలిసి 18 మంది సభ్యుల బలం ఉంది. వీరిద్దరూ రాజీనామా చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ బలం 12కు పడిపోయింది.
తీవ్రంగా మండిపడ్డ ఎమ్మెల్యే లక్ష్మి నారాయణన్
ఎమ్మెల్యే సభ్యత్వానికి లక్ష్మీ నారాయణన్ రాజీనామా చేసేశారు. అంతేకాకుండా కాంగ్రెస్‌కు కూడా గుడ్‌బై చెప్పేస్తున్నానని కీలక ప్రకటన చేశారు. తాను సీనియర్ ఎమ్మెల్యేనని, నాలుగు సార్లు విజయం సాధించానని, అయినా తనకు మంత్రి పదవి దక్కలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను సీనియర్ ఎమ్మెల్యేను. అయినా మంత్రి పదవి దక్కలేదు. నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అయితే ఏ పార్టీలో చేరాలన్నది మాత్రం నా అనుచరులతో కలిసి చర్చిస్తాం. నిర్ణయం తీసుకుంటాం.’’ అని లక్ష్మి నారాయణ ప్రకటించారు.
రాజీనామాలు అందాయి : స్పీకర్ ప్రకటన
ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా పత్రాలు తమకు అందాయని స్పీకర్ వి.పి. శివకొలందు ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని సీఎం నారాయణ స్వామికి, అసెంబ్లీ కార్యదర్శికి కూడా తెలిపామని ఆయన వెల్లడించారు. వారి రాజీనామా పత్రాలను తాను పరిశీలిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.
ఇంతకు ముందు నలుగురు రాజీనామా
మూడు రాష్ట్రాలతో పాటు పాండిచ్చేరి కూడా మరికొన్ని రోజుల్లో ఎన్నికలకు వెళ్లబోతోంది. అయితే ఇక్కడి రాజకీయాలు మాత్రం వేగంగా మారిపోతున్నాయి. రాజకీయ సంక్షోభం తీవ్రంగా ముదిరిపోయింది. మరో రెండు నెలలైతే ఎన్నికలు. ఈ లోపలే వరుస రాజీనామాలతో కాంగ్రెస్ తీవ్ర చిక్కుల్లో పడిపోయింది. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాకు ముందే నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ప్రకంపనలు సృష్టించారు. నమశ్శివాయం, తిప్పయింజన్, సీఎం ప్రధాన అనుచరుడు జాన్ కుమార్, మల్లాడి కృష్ణారావు వరుసగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసేశారు. దీంతో నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. మొత్తం అసెంబ్లీ స్థానాలు 30. 2016 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 15 స్థానాలను గెలుచుకుంది. డీఎంకే 3 స్థానాలను గెలుచుకుంది. దీంతో కాంగ్రెస్, డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
ముందు నుంచీ కష్ఠంగానే నెట్టుకొస్తున్న సీఎం నారాయణ స్వామి
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ సీఎం నారాయణ స్వామి దినదిన గండంగానే నెట్టుకొస్తున్నారు. పైగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆయనకు పక్కన బల్లెంగా మారిపోయారు. ప్రతి విధాన నిర్ణయాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు. దీంతో ఇద్దరి మధ్యా తీవ్ర విభేదాలు కూడా వచ్చేశాయి. కొన్ని సార్లు కోవిడ్ సమీక్షా సమావేశాలను కిరణ్ బేడీయే నిర్వహించేవారు. దీంతో నారాయణ స్వామికి చిర్రెత్తేది. కిరణ్ బేడీ ఏమాత్రం ప్రజాస్వామ్య బద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా ప్రవర్తించడం లేదని, వెంటనే వెనక్కి పిలవాలని డిమాండ్లు చేశారు. అయినా కేంద్రం వినకపోవడంతో నేరుగా రాజ్‌భవన్ ముందే దీక్షకు దిగారు. ఐదారు రోజుల పాటు అక్కడే నిరసనకు దిగారు. దీంతో కేంద్రం ఎల్జీ బాధ్యతల నుంచి కిరణ్ బేడీని తప్పించింది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైకు పుదుచ్చేరి ఎల్జీగా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. అప్పటి నుంచే రాజకీయాలు మాత్రం వేగంగా మారిపోయాయి. చివరికి కాంగ్రెస్ సర్కార్ మైనారిటీలో పడిపోయింది.













