కేంద్రంతో కలిసి నడుద్దాం: ముఖ్యమంత్రులకు ఒడిశా సీఎం లేఖ

ప్రస్తుత పరిస్థితులను అధిగమించాలంటే, కోవిడ్ నుంచి ప్రజలను రక్షించాలంటే వ్యాక్సినేషనే ఏకైక మార్గమని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తేల్చి చెప్పారు. రాష్ట్రాలకు కావాల్సిన వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి, పంపిణీ చేయాలని ఆయన కోరారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. స్వాతంత్ర్యం తర్వాత దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కోవిడ్ అని, ఈ మహమ్మారి నుంచి గట్టెక్కడానికి కేంద్రంతో చేతులు కలిపి, ముందుకు సాగాలని సూచించారు. ఇలా ముందుకు సాగుతూ సమాఖ్య స్ఫూర్తిని చాటాలని కోరారు. రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లినా పెద్ద ప్రయోజనం కనిపించడం లేదని అన్నారు. వ్యాక్సిన్ సరఫరాకు రాష్ట్రంలో ఒప్పందం చేసుకున్నా, కేంద్రం అనుమతి తప్పని సరైందని, దేశీయ ఉత్పత్తి సంస్థలు అవసరానికి తగినంత వ్యాక్సిన్లను సరఫరా చేయలేకపోతున్నాయన్న విషయాన్ని గ్రహించాలని పేర్కొన్నారు. అందుకే కేంద్రంతో కలిసి ముందుకు సాగితే కాస్త ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అయితే, వ్యాక్సినేషన్ విధి విధానాలను మాత్రం కేంద్రం రాష్ట్రాలకే వదిలేయాలని నవీన్ పట్నాయక్ సూచించారు. అన్ని రాష్ట్రాలూ వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యమివ్వాలని, అప్పటి వరకూ ఏ రాష్ట్రమూ క్షేమంగా, స్థైర్యంగా ఉండలేవని నవీన్ పట్నాయక్ అన్నారు.