మేం ఎవరికీ కొమ్ము కాయడం లేదు
ఫేస్బుక్ భారత్లో రాజకీయ పక్షపాతం చూపుతోందని, ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి విదితమే. ఫేస్బుక్ భారత ప్రజాస్వామ్య పక్రియలో జోక్యం చేసుకుంటోందని, అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సభ్యుల విద్వేషపూరిత ప్రసంగాలపై నిబంధనలు వర్తింపచేయడంలో కఠినంగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అందుకు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను ఆధారాలుగా చూపుతోంది. దీనిపై ఫేస్బుక్ స్పందించింది. రాజకీయ పక్షపాతానికి పాల్పడుతున్నామన్న ఆరోపణలను ఫేస్బుక్ కొట్టిపారేసింది. తాము ఎవరికీ వత్తాసు పలకడం లేదని, విద్వేషాలను, మత దురభిమానాలను ఎల్లప్పుడూ ఖండిస్తామని సంస్థ సృష్టం చేసింది.
ఫేస్బుక్ అంటే ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తీకరించుకునే వేదిక అని సంస్థ ఉద్ఘాటించింది. కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఫేస్బుక్ ప్రజావిధానం, విశ్వాసం, భద్రత విభాగం డైరెక్టర్ నీల్ పాట్స్ స్పందించారు. భారత్లో తాము పక్షపాతంతో వ్యవహరిస్తున్నామన్న కాంగ్రెస్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించామని, తాము పక్షపాత ధోరణి పాటించడం లేదని, అత్యున్నత స్థాయిలో సమగ్రతను కాపాడతామని హామీ ఇస్తామని ఆయన తెలిపారు.













