‘‘జై శ్రీరాం’’ అంటే లౌకికవాదానికి వచ్చిన ముప్పేమీ లేదు : రౌత్
‘‘జైశ్రీరాం’’ అంటే లౌకికవాదానికి వచ్చిన ముప్పేమీ లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఎవరి లౌకికవాదం కూడా జై శ్రీరాం అన్న పదంతో చిక్కుల్లో పడదని తేల్చి చెప్పారు. నేతాజీ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని బెంగాల్ మెమోరియల్ హాల్లో ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ ధన్కర్ హాజరయ్యారు. సీఎం మమతా బెనర్జీ ప్రసంగం ప్రారంభించగానే ‘‘జైశ్రీరాం’’ అని కొందరు యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఘటనతో కోపగించిన మమత.. మాట్లాడకుండానే కూర్చుండిపోయారు. ఈ నేపథ్యంలోనే రౌత్ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘జైశ్రీరాం అనేది రాజకీయమ పదమేమీ కాదు. అది విశ్వాసానికి సంబంధించిన అంశం. సీఎం మమతకు కూడా శ్రీరాముడిపై నమ్మకముందని నా విశ్వాసం.’’ అని రౌత్ వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ ‘వీక్ పాయింట్’ ను ఆధారంగా చేసుకొని బీజేపీ ఇలాంటి ఆటలాడుతోందని, ఎన్నికలు ముగిసే వరకూ ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయని రౌత్ అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్రలో జరిగిందే బెంగాల్లో జరుగుతోంది : సామ్నా ఎడిటోరియల్
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర ప్రాంతాలు ముందంజలో ఉన్నాయని శివసేన అధికారిక పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది. తమ తమ ఆత్మగౌరవం కోసం ఈ రాష్ట్రాలు పోరాడుతూనే ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం అణచివేస్తూనే ఉందని శివసేన మండిపడింది. ఓ వ్యూహం ప్రకారమే మహారాష్ట్రను కేంద్రం అణిచవేస్తోందని సామ్నా సంపాదకీయంలో శివసేన మండిపడింది. ఎన్నికల మునుపే బీజేపీ శివసేన, ఎన్సీపీ అభ్యర్థులను ముప్పుతిప్పలు పెట్టిందని, ఈ ముప్పుతిప్పలకు గురైన వారే తిరిగి విజయం సాధించారని పేర్కొంది. ‘మహారాష్ట్రలో ఏం జరుగుతుందో బెంగాల్లోనూ అదే జరుగుతోంది. బీజేపీకి సొంతమంటూ ఏదీ లేదు. ఆ పార్టీతో ఎవరు పోరాడితే వారిని టార్గెట్ చేస్తుంది. బిహార్లోనూ ఇదే జరిగింది. బెంగాల్లోనూ అదే జరుగుతోంది.’’ అని శివసేన ధ్వజమెత్తింది.













