సిబ్బందికి ‘ డ్రెస్‌కోడ్ ’ ప్రకటించిన సీబీఐ బాస్

అత్యంత ప్రతిష్ఠత్మకమైన సీబీఐ తమ సిబ్బందికి డ్రెస్‌కోడ్ ప్రకటించింది. విధి నిర్వహణలో ‘ఫార్మల్ దుస్తులు’ మాత్రమే ధరించాలని తేల్చి చెప్పింది. జీన్సులు, టీషర్టులు, స్పోర్ట్స్ షూస్‌ను విధి నిర్వహణలో ధరించడాన్ని నిషేధించింది. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై అధికారులు తమ విధి నిర్వహణలో జీన్స్, స్పోర్ట్స్ షూస్ ధరిస్తే మాత్రం ఏమాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు. విధి నిర్వహణలో షర్టు, ఫార్మల్ ప్యాంటులు, ఫార్మల్ షూస్ ధరించాలని, తప్పనిసరిగా షేవింగ్ చేసుకొనే విధులకు రావాలని, ఇక మహిళా సిబ్బంది కేవలం చీరలు, సూట్లు, ఫార్మల్ షర్టులు, ట్రౌజర్స్ ధరించాలని సీబీఐ బాస్ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీబీఐ బ్రాంచీలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ ప్రకటించారు.