అరెస్టు నుంచి కేజ్రీవాల్‌కు మినహాయింపు ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా, తీవ్రమైన చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం కేసు సాగుతున్నందున తాము ఇందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. లిక్కర్ స్కాంలో జరిగిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటికే 9 సార్లు నోటీసులు అందించిన విషయం తెలిసిందే. చివరిసారిగా ఇచ్చిన నోటీసులకు నేడు అనగా మార్చి 21, గురువారం నాడు హాజరుకావాల్సి ఉంది. కానీ కేజ్రీవాల్ ఈడీ ముందుకు వెళ్లకుండా సమన్లను సవాల్ చేస్తూ హైకోర్టు తలుపు తట్టారు.
కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని, అరెస్టు చేస్తారని భావిస్తుంటే చట్టపరమైన రక్షణ ఎందుకు తీసుకోలేదని ఎదురు ప్రశ్నించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. దీంతో ఈ రోజు (గురువారం) మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ఈడీ ముందు విచారణకు హాజరుకావడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే ఈడీ తనను అరెస్ట్ చేయకుండా, తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా నిలువరించాలని, ముందస్తు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఇన్నిసార్లు సమన్లు జారీ చేయడానికి బదులు అరెస్టు చేయవచ్చు కదా అని ఈడీని ప్రశ్నించింది. దానికి ఈడీ.. తాము అరెస్టు చేయాలనుకోవడం లేదని, కేవలం విచారణ మాత్రమే చేయాలనుకుంటున్నామని సమాధానమిచ్చింది. అయితే ఈ వాదనను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ తరపు న్యాయవాది.. అరెస్ట్ చేయకుంటే, ఏ ఆధారాలతో విచారణ కోరుతున్నారని, ఆ ఆధారాలను తమకు చూపించాలని కోరారు. కోర్టు కూడా ఈడీని ఆధారాలు చూపించాలని కోరింది. అయితే కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న ఆధారాలను బహిరంగంగా చూపించలేమని ఈడీ పేర్కొనడంతో.. ధర్మాసనం తమకు సీల్డ్ కవర్లో అందించాలని కోరింది. అందుకు అంగీకరించిన ఈడీ.. తమ వద్ద ఉన్న ఆధారాల ఫైల్‌ను కోర్టుకు సీల్ట్ కవర్లో అందించింది. వీటిని పరిశీలించిన ధర్మాసనం.. ఈడీ సమర్పించిన ఆధారాల్లో తప్పు జరిగినట్లు అనిపిస్తోందని, అందువల్ల కేజ్రీవాల్‌కు అరెస్ట్ నుంచి మినహాపింపును ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. సమన్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన తొలి పిటిషన్‌తో పాటే ఈ పిటిషన్‌పై కూడా తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉంటే మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీఎం కేజ్రీవాల్ ఒకసారి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. గతేడాది ఏప్రిల్‌లో ఈ విచారణ జరిగింది. దాదాపు 9 గంటల పాటు కేజ్రీవాల్‌ను ప్రశ్నించింది. ఇక మరోసారి విచారణకు హాజరు కావాలని కోరుతూ కేజ్రీవాల్‌కు ఈడీ వరుస సమన్లు జారీ చేస్తోంది. కానీ ఈ సారి కేజ్రీవాల్ విచారణకు హాజరుకావడానికి నిరాకరిస్తూ వస్తున్నారు. ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయి జైల్లో ఉన్నారు.













