కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్షమాపణలు.. ఎందుకంటే
జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మధ్యప్రదేశ్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ రాష్ట్ర హైవేపై ఒక చోట అద్వాన్నంగా నిర్మించిన రోడ్డుపై సారీ చెప్పారు. ఆ ప్రాజెక్టును కొత్త కాంట్రార్టర్కు అప్పగించినట్లు వెల్లడించారు. జబల్పూర్లోని మండలలో జరిగిన కార్యక్రమంలో రూ.1,361 కోట్ల విలువైన ఐదు జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. నాకు బాధగా ఉంది. నేను చాలా విచారం వ్యక్తం చేస్తున్నా, పొరపాటు జరిగితే క్షమాపణ చెప్పడానికి నేను వెనుకాడను. మండల-జబల్పూర్ హైవేలో 63 కిలోమీటర్ల మేర బరేలా నుంచి మండలానికి రూ.400 కోట్లతో రహదారిని నిర్మించాం. అయితే దానిపై నేను సంతృప్తి చెందలేదు. మీలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడకు రాక ముందే నా అధికారులతో మాట్లాడాను. ఆ కాంట్రాక్టర్ను తప్పించి కొత్తగా టెండర్ పిలవాలని చెప్పా. త్వరలో మంచి రోడ్డు అందుబాటులోకి వస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఇబ్బందులకు నేను క్షమాపణలు కోరుతున్నా అని అన్నారు. దీంతో ఆ సభకు హాజరైన ప్రజలు చప్పట్లతో గడ్కరీ నిజాయితీని అభినందించారు.













