కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
కార్లలో ఎయిర్‌బ్యాగులకు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం అనుకోవడం లేదని తెలిపారు. కార్లలో ప్రయాణికుల భద్రత కోసం ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఆరు ఎయిర్ బ్యాగులు నిబంధన తీసుకురానున్నట్లు గతంలో మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ తప్పనిసరి చేయాలనుకోవడం లేదని తెలిపారు. కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పరీక్షించి సేఫ్టీ రేటింగ్ ఇచ్చేందుకు భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ను ఇటీవల తీసుకొచ్చినట్లు గడ్కరీ తెలిపారు. దీంతో ఒక కారు 5 స్టార్ రేటింగ్ పాందాలంటే 6 ఎయిర్‌బ్యాగులు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మెరుగైన స్టార్ రేటింగ్ అందుకునే క్రమంలో ఆరు ఎయిర్‌బ్యాగులను కార్ల కంపెనీలు అమర్చాల్సి ఉంటుందని, అందుకే తాము తప్పనిసరి చేయాలని అనుకోవడం లేదని తెలిపారు.













