తెలుగు రాష్ట్రాల్లో ఉగ్ర కార్యకలాపాలు.. పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, నిర్మల్, జగిత్యాలతోపాటు ఆంధ్రప్రదేశ్లో కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులోని నిందితులు, దీంతో సంబంధం ఉందని అనుమానిస్తున్న వారిఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 చోట్ల, నిర్మాల్ జిల్లా భైంసాలోని మదీనా కాలనీలో, జగిత్యాలలోని టవర్ సర్కిల్లో ఉన్న కేర్ మెడికల్ తదితర ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. పాపులర్ ఫ్రంట్ కార్యకలాపాలతో అక్కడి వారికి ఉన్న సంబంధాలపై అధికారులు ఆరాతీస్తున్నారు.
అలాగే ఏపీలోని కర్నూలు, కడప జిల్లాల్లో 23 ఎన్ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో 2 బృందాలతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. పీఎఫ్ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లాతోపాటు ఇమ్రాన్, అబ్దుల్ అనే ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కరాటే శిక్షణ, లీగల్ అవేర్నెస్ ముసుగులో పీఎఫ్ఐ కార్యకలాపాలు జరుగుతూ వచ్చాయి. మతకలహాలు సృష్టించేందుకు ఆయా సంస్థల్లో యువతకు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఐఏ దృష్టికి వచ్చింది. భైంసా అల్లర్లతో కూడా వీరికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.













