బీజేపీనీ వీడిన నేతాజీ మనవడు
స్వాతంత్య్ర ఉద్యమకారుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు, బెంగాల్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు చంద్ర కుమార్ బోస్ బీజేపీనీ వీడారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేతాజీ దార్శనికతను ప్రచారం చేస్తామన్న హామీని కాషాయ పార్టీ నిలబెట్టుకోలేదని, అందుకే బీజేపీ నుంచి వైదొలుగుతున్నట్లు చంద్ర కుమార్ బోస్ తెలిపారు. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు చంద్ర కుమార్ బోస్ తన రాజీనామా లేఖను పంపారు. బీజేపీ వేదికగా నేతాజీ సోదరుల (సుభాష్, శరత్ చంద్రబోస్) సిద్ధాంతాలను నేటి తరానికి అందజేయాలని నేను భావించాను. ఇందుకు గతంలో పార్టీ హైకమాండ్ కూడా హామీ ఇచ్చింది. అయితే, ఈ లక్ష్యాలను చేరుకోవడంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో పార్టీ నుంచి నాకు సహకారం లభించట్లేదు. నా ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదు అని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే, ఈ లేఖపై బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి శామిక్ భట్టాచార్య స్పందించారు. చాలా కాలంగా ఆయన పార్టీతో టచ్లో లేరని తెలిపారు.













