పదేండ్ల క్రితం ప్రాంతీయ పార్టీ.. ఇప్పుడు జాతీయ పార్టీ
ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్ ఎన్నికలు చిరకాలం గుర్తుండి పోతాయి. ఎందుకంటే ఆ పార్టీ జాతీయ హోదాకు గుజరాత్ ఎన్నికలు చిరునామాగా నిలిచాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లో కూడా పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ విఫలమైంది. అయినప్పటికీ జాతీయ హోదాకు కావాల్సిన అర్హతను సాధించింది. దీంతో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేవారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ఆప్ జాతీయ పార్టీగా అవతరించడం సంతోషంగా ఉందన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకుని జాతీయ పార్టీకి అర్హత సాధించిందన్నారు. పదేండ్ల క్రితం ఆప్ ప్రాంతీయ పార్టీ అని గుర్తు చేశారు. పదేండ్ల తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుని, జాతీయ పార్టీగా అవతరించిందని అన్నారు.













