ఇకపై నెల నెలా బెంగాల్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ
ఎక్కడ ఏమాత్రం పట్టు దొరికినా… అక్కడ బీజేపీ జెండాను పాతేయాలని బీజేపీ అధిష్ఠానం డిసైడ్ అయ్యింది. అసలు ఏమాత్రం బీజేపీ ఛాయలు కూడా లేని ప్రాంతాల్లో కనీసంలో కనీసం రెండో స్థానాన్నైనా ఆక్రమించుకోవాలని అమిత్షా, మోదీ ద్వయం వ్యూహంగా కనిపిస్తోంది. కార్యకర్తలకు, నేతలకు కూడా ఈ ద్వయం ఇలాగే చెబుతోంది. ఈ వ్యూహం ప్రకారమే బీజేపీ అగ్రనేతలందరూ కష్టపడుతూ వస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ అధిష్ఠానం దృష్టి అంతా బెంగాల్ పై కేంద్రీకృతమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి జరిగిన తర్వాత కేంద్ర హోంమంత్రి బెంగాల్ పై మరింత పట్టు బిగించారు. ఎలాగైనా.. ఈ సారి సీఎం మమతకు ఝలక్ ఇచ్చి… బీజేపీ జెండా ఎగురవేయాలని తహతహలాడిపోతున్నారు. ఇప్పటికే ఆరుగురు కేంద్ర మంత్రులకు బెంగాల్ వ్యవహారాలను అప్పజెప్పింది అధిష్ఠానం. నెలలో 15 రోజుల పాటు తమకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే బస చేయాలని, కార్యక్షేత్రంలో పార్టీని పూర్తిగా బలోపేతం చేయాలని ఆదేశించింది.
స్థానిక పరిస్థితులు, సమస్యలను పూర్తిగా ఆకళింపు చేసుకొని… బీజేపీని విజయతీరాల వైపు తీసుకెళ్లాలని సూచించింది. ఇక వ్యూహకర్త, కేంద్ర హోంమంత్రి అమిత్షా, అధ్యక్షుడు నడ్డా ప్రతి నెలకోసారి కచ్చితంగా బెంగాల్ లో పర్యటించేలా తమ తమ షెడ్యూల్ ను రూపొందించుకున్నారు. ఇప్పటికే రెండు సార్లు అమిత్షా బెంగాల్ ను చుట్టి వచ్చారు. చుట్టి రావడమే కాకుండా ఏకంగా మమతా బెనర్జీకి కుడి భుజంగా మెలుగుతూ వచ్చిన సుబేందు అధికారిని తమవైపు లాగేసుకొని, బీజేపీ కండువా కప్పేశారు. ఆయనతో పాటు తృణమూల్, వామపక్షాలు, కాంగ్రెస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలనూ బీజేపీలోకి లాగేసుకున్నారు. ఇలా బెంగాల్ లో పర్యటించిన ప్రతిసారీ మమతకు ఏదో ఒక రకంగా షాకివ్వాలని బీజేపీ నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగానే పాచికలనూ వేస్తోంది. ఇక బెంగాల్ బీజేపీ శాఖ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి ప్రతి నెలా బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించేలా వ్యూహాన్ని ఖరారు చేసింది. ఇందుకు మోదీ కూడా ఓకే చెప్పారని బెంగాల్ బీజేపీ వెల్లడించింది. ఇకపై ప్రతినెలా… ఎన్నికలు ముగిసే వరకూ మోదీ బెంగాల్లో పర్యటించనున్నారు. ‘‘ఇకపై ప్రధాని మోదీ ప్రతినెలా బెంగాల్లో పర్యటిస్తారు. అయితే తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. బహుశః జనవరి మాసాంతం లేదా ఫిబ్రవరి మొదటి వారం నుంచి మోదీ షెడ్యూల్ ఉండొచ్చు.’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వెల్లడించారు.
అటు కేంద్ర మంత్రులు, ఇటు హోంమంత్రి, ప్రధాన మంత్రి… ఇలా అందరూ బెంగాల్లో పర్యటించడం ద్వారా సీఎం మమతను మానసికంగా ఓ చక్రబంధంలో బంధించి…. రాజకీయంగా దెబ్బతీయాలన్న వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందని తృణమూల్ నేతలూ అంటున్నారు. అయితే మోదీ నెలనెలా పర్యటనపై కాంగ్రెస్ స్పందించింది. ‘‘ప్రతిరోజూ బెంగాల్ కు వచ్చినా… జరిగేదేమీ లేదు. నెలనెలా పర్యటిస్తే ఏమవుతుంది? బీజేపీ ఎంత భయపడుతుందో దీన్ని బట్టే తెలుస్తోంది. మోదీకి ఏం పని లేదని దీన్నిబట్టే తెలుస్తోంది.’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీ విరుచుకుపడ్డారు.













