బిహార్‌లో బీజేపీకి భారీ షాక్.. ఎన్నికల ముందు కీలక నేత రాజీనామా
లోక్‌సభ ఎన్నికలకు ముందు బిహార్‌లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, పార్లమెంట్ సభ్యుడు అజయ్ నిషాద్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి ఎంపీగా ఉన్న అజయ్ నిషాద్ తన రాజీనామా గురించి సోమవారం అధికారికంగా ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బిహార్‌లో కొద్దిరోజుల క్రితమే ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల కేటాయింపు పూర్తయింది. అయితే ఈ కేటాయింపులో భాగంగా అజయ్ నిషాద్కు పార్టీ టిక్కెట్ నిరాకరించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. బీజేపీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ ఆఫీస్‌లో ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేర సమక్షంలో నిషాద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కాగా.. బీజేపీకి రాజీనామా చేయడానికి కొద్ది సేపటి ముందే నిషాద్.. తన ఎక్స్ ఖాతా నుంచి ‘మోదీ కా పరివార్’ ట్యాగ్‌ను తొలగించారు. ఆ తర్వాత ఓ పోస్ట్ ద్వారా తన ఆవేదన వెళ్లగక్కారు. బీజేపీ వంచన కారణంగానే ఆ పార్టీకి రాజీనామా చేశానన్న నిషాద్.. ఆ పార్టీ చేసిన మోసంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యారని, ఆ కారణంగానే పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకూ రాజీనామా చేశానన్నారు. ‘‘ఉరిశిక్ష విధించిన వ్యక్తిని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. బీజేపీ కనీసం ఒక్కసారి కూడా నన్ను సంప్రదించకుండా టిక్కెట్ రద్దు చేసింది. మీడియా ద్వారా ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డా’’ అంటూ నిషాద్ తన పోస్ట్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే నిషాద్.. 2014లో ప్రస్తుత బిహార్ కాంగ్రెస్ చీఫ్ అఖిలేష్ ప్రసాద్ సింగ్‌ను 2 లక్షల 22 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు. 2019లో కూడా ముఖేష్ సాహ్ని పార్టీ అభ్యర్థి రాజ్ భూషణ్ చౌదరి నిషాద్‌ను ఆయన ఓడించారు. అయితే విచిత్రంగా ఈ దఫా బీజేపీ అజయ్ నిషాద్కు కాదని, రాజ్ భూషణ్ చౌదరి నిషాద్‌ను ముజఫర్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక నిషాద్ రాకతో కాంగ్రెస్‌లో కాన్ఫిడెన్స్ పెరిగినట్లైంది. ముఖ్యంగా ముజఫర్‌పూర్, దర్బంగా, చంపారాన్, మధుబని ప్రాంతాల్లోని ఈబీసీ ఓట్లు తమకు అనుకూలంగా మారతాయని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఈ క్రమంలోనే చురు ఎంపీ రాహుల్ కాస్వాన్, హిసార్ ఎంపీ బ్రిజేంద్ర సింగ్ సైతం కాంగ్రెస్‌లో చేరారు.













