బీజేపీ వైపు తిరిగి చూడనంటూ… సొంత గూటికి వచ్చేసిన ముకుల్ రాయ్

బీజేపీ నేత ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ముకుల్‌తో పాటు ఆయన కుమారుడు సుభ్రాంషు రాయ్ కూడా టీఎంసీలో చేరారు. కొన్ని రోజులుగా ఆయన బీజేపీని వీడి, తృణమూల్‌లో చేరిపోతారని వార్తలొచ్చాయి. తిరిగి ఆయన సొంత గూటికి చేరడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. ఈ సందర్భంగా ముకుల్ రాయ్ మాట్లాడుతూ… ‘‘తిరిగి సొంత గూటికి రావడం ఆనందంగా ఉంది. ఇకపై ఎప్పుడూ బీజేపీ వైపు తిరిగి చూడను. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా బీజేపీలో ఎవరూ ఉండరు. మమత నాయకత్వాన్ని పూర్తిగా బలపరుస్తున్నా. భారత్‌కు, బెంగాల్‌కు ఏకైక నాయకురాలు మమతే. మమతతో నాకు ఎప్పుడూ విభేదాలు లేవు’’ అని ముకుల్ రాయ్ ప్రకటించారు.
ఇంటి బిడ్డ… ఇంటికి వచ్చేశాడు : మమత
ముకుల్ రాయ్ తిరిగి సొంత గూటికి చేరడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆనందం వ్యక్తం చేశారు. ముకుల్ ఇంటి పిల్లవాడు అంటూ మమత వ్యాఖ్యానించారు. ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని, రాబోయే రోజుల్లో కీలక పాత్ర పోషించబోతున్నారని మమత ప్రకటించారు. బీజేపీలో చాలా దోపిడీ ఉందని, అందులో ఉండడం అందరికీ ఇబ్బందే అని విమర్శించారు. ‘‘ఓల్డ్‌ఈజ్ గోల్డ్ కదా. ఆయన మళ్లీ సొంతింటికి వచ్చారు. మరి కొంత మంది నేతలు కూడా వచ్చేస్తున్నారు’’ అని మమత ప్రకటించారు. అయితే అందర్నీ పార్టీలోకి ఆహ్వానిస్తారా? అని మీడియా అడగ్గా, మమత ఘాటుగా స్పందించారు. ఎన్నికల ముందు బీజేపీలో చేరిన వారిని మాత్రం తిరిగి తీసుకునే ప్రశ్నే లేదని, వారంతా ద్రోహులని మమత ఘాటుగా వ్యాఖ్యానించారు. ముకుల్ రాయ్‌ను బీజేపీ బెదిరించిందని, ఆయన ఆరోగ్యం కూడా పాడైందని మమత ఆరోపించారు.
బీజేపీలో కీలక పాత్ర పోషించిన ముకుల్
ఎన్నికల కంటే చాలా రోజుల ముందు ముకుల్ రాయ్ తృణమూల్‌ను వీడి, బీజేపీలో చేరిపోయారు. మమతకు అత్యంత సన్నిహితుడిగా ముకుల్ రాయ్ వ్యవహరించేవారు. దీంతో అప్పట్లో ఈయన పార్టీని వీడటం పెద్ద చర్చనీయాంశమైంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి, ఘన విజయం సాధించారు. అంతేకాకుండా బీజేపీ పునాదులను పటిష్ఠం చేయడంలో ముకుల్ కీలక పాత్ర పోషించారు. బెంగాల్‌లో బీజేపీకి కొత్త ఓటు బ్యాంకు సృష్టించడంలో ముకుల్ పాత్ర కూడా ఉంది.