ముంబైకు సాయం ప్రకటించిన భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ
మహారాష్ట్రలో కోవిడ్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకక, ఆక్సిజన్ దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, భారత దేశ కుబేరుడు ముఖేశ్ అంబానీ తన ఉదారతను చాటుకున్నారు. మహారాష్ట్రకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. తన రిలయన్స్ ఇండస్ట్రీ రిఫైనరీలలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను ముంబైకు అందజేయాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఇండస్ట్రీస్ గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ముంబైకు ఆక్సిజన్‌ను ఉచితంగా అందించాలని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయాన్ని రిలయన్స్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఇదే విషయాన్ని మహారాష్ట్ర మంత్రి ఏకనాథ్ షిండే కూడా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘రిలయన్స్ నుంచి 100 టన్నుల ఆక్సిజన్ త్వరలో మహారాష్ట్రకు రానుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ఇది వస్తుంది. రాయ్‌గఢ్ డివిజనల్ కమిషనర్, థానే జిల్లా కలెక్టర్, ఎఫ్‌డీఏ కమిషనర్‌తో ఉన్న సమన్వయ కమిటీ ఈ సరఫరాను సమన్వయం చేస్తుంది’’ అంటూ ఏకనాథ్ షిండే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.













