ఎవరెస్ట్ ఎత్తు 8848.86 మీటర్లు
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన పర్వతం ఎవరెస్ట్ ఎత్తును నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. మౌంట్ ఎవరెస్ట్ 8848.86 మీటర్లు ఉందని తెలిపింది. అయితే ఎవరెస్ట్ ఎత్తు సుమారు 86 సెంటీమీటర్లు పెరిగినట్లు తెలిపారు. నేపాలీలు ఎవరెస్ట్ పర్వతాన్ని సాగర్‌మతా జుములంగామా అని పిలుస్తారు. ఆ పర్వతం ఎత్తు పెరిగినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రదీప్ గయావాలీ ఖాట్మండులో ప్రకటించారు. 2015లో నేపాల్‌ను నేలమట్టం చేసిన భూకంపం వల్ల ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరిగిందా లేక తగ్గిందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తును లెక్కించింది.
నేపాలీతో పాటు చైనీస్ సర్వేయర్లు కూడా ఈ కొలతల ఈవెంట్‌ను చేపట్టినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 11వ తేదీన అంతర్జాతీయ మౌంటేన్ డే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల ముందే ఈ ప్రకటన వెలుబడినట్లు తెలుస్తోంది. 1995 నుంచి మౌంట్ ఎవరెస్ట్ ఎత్తును 8,848(29,098 ఫీట్లు) మీటర్లుగా గుర్తిస్తున్నారు. కోవిడ్ వల్ల ఎవరెస్ట్ ఎత్తుపై ప్రకటన ఆలస్యం జరిగినట్లు మంత్రులు తెలిపారు.













