సీఎం యడియూరప్పపై విరుచుకుపడ్డ బీజేపీ ఎమ్మెల్సీ… దుమ్ము దుమారం రేపుతున్న వ్యాఖ్యలు

యడియూరప్ప ప్రభుత్వంలో ముసలం ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకో ఎమ్మెల్యే, రోజుకో నేత సీఎం యడియూరప్పపై తీవ్ర వ్యాఖ్యలు, అసహనం, అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. తాజాగా ఓ ఎమ్మెల్సీ ఏకంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ అరుణ్ సింగ్ ఎదుటే సీఎంపై విరుచుకుపడ్డారు. ఇది కాస్త పార్టీలో దుమ్ము దుమారమే రేపింది. ఏకంగా అరుణ్ సింగ్ ఆ వ్యాఖ్యలపై స్పందించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి తలెత్తిన నేపథ్యంలో అరుణ్ సింగ్ బెంగళూకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, నేతలందరితో సమావేశమయ్యారు. ఈ కోవలోనే ఎమ్మెల్సీ విశ్వనాథ్ అభిప్రాయాన్ని కూడా అరుణ్ సింగ్ తీసుకున్నారు. ఈ సమయంలోనే విశ్వనాథ్ సీఎం యడియూరప్పపై విరుచుకుపడ్డారు. యడియూరప్ప నాయకత్వాన్ని తాము గౌరవిస్తామని, అయితే ఆరోగ్య సమస్యలతో పాటు ఆయన వయస్సు కూడా పెరుగుతోందని, దీంతో ప్రభుత్వాన్ని నడిపే బలం ఆయనకు లేదని ఘాటుగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యడియూరప్పపై మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఓ రకంగా కర్నాటకలో రాజవంశ పాలన సాగుతోందని, అసలు ప్రధాని మోదీ ఉన్నారన్న విషయాన్నే కర్నాటక నేతలు మరిచిపోయారని వ్యాఖ్యానించారు. అదేవిధంగా పనిలో పనిగా యడియూరప్ప కుటుంబ సభ్యుల జోక్యంపై కూడా విశ్వనాథ్ ఇన్‌చార్జీ అరుణ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం కుటుంబం తరచూ జోక్యం చేసుకుంటోందని ఫిర్యాదు చేశారు.
బీజేపీ ‘వర్కింగ్ స్టైల్’ ఆయనకు తెలియదు : అరుణ్ సింగ్
ఎమ్మెల్సీ విశ్వనాథ్ గతంలో జేడీయూలో పనిచేశారు. అయితే జేడీఎస్, కాంగ్రెస్ సర్కారు కుప్పకూలిన సమయంలో 18 మంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు మద్దతిచ్చారు. అందులో విశ్వనాథ్ ఒకరు. అయితే విశ్వనాథ్ వ్యాఖ్యలపై అరుణ్ సింగ్ స్పందిస్తూ… ‘‘ఆయన మా పార్టీకి కొత్త. మా వర్కింగ్ స్టైల్, సంస్కృతి ఆయనకు జీర్ణం కాలేదు. అందుకే అలా మాట్లాడారు’’ అని వ్యాఖ్యానించారు. అసంతృప్తుల అభిప్రాయాలను తాము తెలుసుకున్నామని, పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవరూ మాట్లాడవద్దని ఘాటుగా హెచ్చరించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని అరుణ్ సింగ్ హెచ్చరించారు.