అమెరికన్ ఎంబసీ కీలక ప్రకటన… జులైలో అదనపు అపాయింట్మెంట్ లు

స్టూడెంట్ వీసాలపై దిగులు చెందవద్దని, జూలైలో అదనపు అపాయింట్‍మెంట్లు ఇస్తామని అమెరికన్ ఎంబసీ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో అమెరికన్ ఎంబసీ జూన్ 14 నుంచి స్టూడెంట్ వీసాల అపాయింట్‍మెంట్లకు దరఖాస్తులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులంతా ఒక్కసారిగా వెబ్‍సైట్‍లో లాగిన్ అవుతున్నారు. ఫలితంగా పలుమార్లు సైట్ క్రాష్ అవుతోంది. అదే సమయంలో పదే పదే రిఫ్రెష్ కొట్టడంతో చాలామంది ఖాతాలు లాక్ అయిపోయాయి. దీంతో 72 గంటపాటు ఆ ఖాతాలు స్తంభించిపోతున్నాయి. చాలా మంది తమ ఖాతను ఆన్‍లాక్ చేయాలని ఎంబసీకి విన్నవిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న అమెరికన్ ఎంబసీ.. అపాయింట్‍మెంట్ల విషయంలో ఆందోళన చెందవద్దని, జూలైలో మరిన్ని అపాయింట్‍మెంట్లు ఇస్తామని ప్రకటించింది.