బెంగాల్, అసోంలో పర్యటించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం బెంగాల్లో ప్రచారం నిర్వహించారు. పురూలియాలో జరిగిన ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మమతా బెనర్జీ ‘ఆట మొదలైంది’ అని ప్రకటిస్తున్నారని, తాము మాత్రం అభివృద్ధి మొదలైందని అంటున్నామని వ్యాఖ్యానించారు. ఆటకు ముగింపు ప్రారంభమైందని, అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని మోదీ అన్నారు. ఎన్నికల సందర్భంగా సీఎం మమత ‘ఖేలా హోబే’ (మనం ఆడుకుందాం) అన్న నినాదంతో దూసుకెళ్తున్నారు. దీనికి విరుగుడుగా ప్రధాని ‘వికాస్ ఆరంభ్ హోబే’ అన్న నినాదంతో ముందుకు వెళ్తున్నారు.
బెంగాల్ ప్రజలను దీదీ పదేళ్ల పాటు ఆడుకున్నారని, ఇక ఆట చాలని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘దీదీ… మీరు బెంగాల్ ప్రజల జీవితాలతో పదేళ్లు ఆడుకున్నారు. ఇప్పటికీ ఇంకా ఆట గురించే మాట్లాడుతున్నారు. కానీ…. మేము మాత్రం అభివృద్ధిపైనే దృష్టి పెట్టాం. అభివృద్ధి జరుగుతుంది. మహిళలు సాధికారత సాధిస్తారు. ప్రతి ఇంటికీ తాగు నీరు అందుతుంది. రైల్వేలు, రోడ్లు బాగుపడతాయి. విద్యను అందిస్తాం. బెంగాలీలతో మమత ఆడుకునే రోజులు ఎప్పుడో పోయాయి.’’ అంటూ మోదీ విరుచుకుపడ్డారు. చాలా రోజులుగా ప్రజలతో ఆడుకుంటున్నారని, దుర్గా మాత దయతో మీరు ఓడిపోతారని పేర్కొన్నారు. దీదీతో పాటు ఆమె వర్గీయులు స్వలాభం కోసం మావోయిస్టులను కూడా ప్రోత్సహించారని మోదీ ఆరోపించారు. కరోనా సమయంలో ప్రజల క్షేమం దృష్ట్యా బియ్యాన్ని అందించామని, దానిని అధికార తృణమూల్ నేతలు ఇందులో కూడా అవినీతి చేశారని మండిపడ్డారు. రైతులు ప్రభుత్వ సహాయం కోసం మొత్తుకుంటున్నా… వారి మానాన వారిని వదిలేస్తున్నారని మోదీ దుయ్యబట్టారు. మరోవైపు సీఎం మమత గాయంపై కూడా ప్రధాని మోదీ మొదటి సారిగా స్పందించారు. ‘‘గాయం కావడం వెనక కుట్ర దాగుందని మమత పదే పదే పేర్కొంటున్నారు. దీదీ ఇబ్బందిపడ్డప్పుడు నేను బాధపడ్డా. తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని మోదీ తెలిపారు. టీఎంసీ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. పదేళ్ల పాటు తప్పుడు పరిపాలన అందించిందని, తాము అధికారంలోకి రాగానే వారందరికీ శిక్షలు వేస్తామని మోదీ ప్రకటించారు.
అసోంను కాంగ్రెస్ ధ్వంసం చేసింది : అసోం సభలో మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ పర్యటన ముగించుకొని అసోంలో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ విధానాలతో అసోం అన్ని రకాలుగా ధ్వసమైందని, సాంస్కృతికంగా, సామాజికంగా, రాజకీయంగా అసోంను దెబ్బతీశాయని మండిపడ్డారు. కాంగ్రెస్కు స్థిరమైన ఆలోచనలు ఉండవని, అందుకే స్థిరమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేదని ఎద్దేవా చేశారు. మంచి విధానాలు, నిర్ణయాలు, సమర్థ నాయకత్వం ఉన్న బీజేపీ ఓ వైపు… సైద్ధాంతిక శూన్యత, నాయకత్వ లోపం ఉన్న కాంగ్రెస్ మరోవైపు నిలిచిందని పేర్కొన్నారు. తాము అసోంను అన్ని రకాలుగా కలుపుకోవాలని చూస్తున్నామని, కాంగ్రెస్ మాత్రం అసోంను విడదీయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్న నినాదంతో తాము ముందుకు సాగుతున్నామని మోదీ వివరించారు.













