ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనత…
ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనత సాధించారు. వరుసగా 20 ఏండ్ల పాటు అధికారంలో ఉన్న ప్రపంచ నేతల సరసన ఆయన నిలిచారు. 2001లో సరిగ్గా ఇదే రోజున గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ 13 ఏండ్ల వరకు ఆ ప పదవిలో ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం అనంతరం ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఆయన ఏడు ఏండ్లుగా ఆ హోదాలో కొనసాగుతున్నారు. దీంతో వరసుగా 20 ఏండ్లు ఏ ఎన్నికల్లో కూడా మోదీ ఓటమిని చూడలేదంటూ బీజేపీ నేతలు ప్రశంసలు గుప్పించారు. నమో 20వ ఏడాది హ్యాష్‌ట్యాగ్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో తమ సంతోషాన్ని పంచుకున్నారు.
ప్రపంచంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న వ్యక్తుల్లో మోదీ ఒకరంటూ కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్డ్ డబ్ల్యూ బుష్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, దివంగత బ్రిటన్ ప్రధాన మంత్రి మార్గరెట్ థాచర్ పదవీ కాలాలతో ప్రధాని మోదీ పదవీ కాలాన్ని పోల్చారు. భారతీయులందరికీ ఇది ఎంతో గర్వకారణమని రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ప్రపంచంతో పాటు భారత్‌తో శాంతి, స్థిరత్వం కోసం మరింత కాలం అధికారంలో కొనసాగే శక్తి మోదీకి లభించాలని ఆకాంక్షించారు.













