మోదీ నామినేషన్.. వివాదాస్పదమైన తన ఎడ్యుకేషన్ పై అఫిడవిట్ తో క్లారిటీ..

భారత ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఆయన తన పేరు మీద మూడు కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో ప్రకటించారు. ఇక తన పేరిట ఎటువంటి ఇల్లు కానీ.. కారు కానీ లేవని ఆయన ఈ అఫిడవిట్‌లో క్లియర్ గా పేర్కొన్నారు. ఇక మోదీ ప్రకటించిన 3.02 కోట్ల ఆస్తిలో సుమారు రూ. 2 కోట్ల 86 లక్షలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్నాయి. ఇది కాక మోదీ చేతిలో ప్రస్తుతం రూ. 52 వేల 920 ఉన్నట్లు తెలుస్తోంది. గాంధీనగర్, వారణాసిలో ఉన్న మరొక రెండు బ్యాంకు ఖాతాలలో రూ. 80 వేల 304 రూపాయలు నగదు ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా 9.12 లక్షలు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ లో మోదీ పెట్టుబడిగా పెట్టారు. వీటితోపాటు ఆయన దగ్గర 2.68 లక్షల విలువ చేసే నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. 2018-19 సమయంలో కేవలం 11 లక్షల 14 వేలు ఉన్న మోదీ ఆదాయం ప్రస్తుతం 23 లక్షల 56 వేలకు పెరిగింది. గత కొద్ది కాలంగా వివాదాస్పదంగా ఉన్న మోదీ ఎడ్యుకేషన్ గురించి కూడా ఈ అఫిడవిట్ ద్వారా పూర్తి క్లారిటీ వచ్చింది. 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా అందుకున్నట్లు పేర్కొన్న మోదీ.. 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ చదివినట్లు చెప్పారు. జూన్ 1న చివరి విడతలో వారణాసి లోక్ సభ స్థానానికి పోలింగ్ జరగబోతోంది.