‘ఇండియా’ అధికారంలోకి వస్తే అయోధ్యపైకి బుల్డోజర్లు: మోదీ

దేశంలో ఒకవేళ ‘ఇండియా’ కూటమి కనుక అధికారంలోకి వస్తే అయోధ్యలో నిర్మించిన రామ మందిరం పైకి కాంగ్రెస్ బుల్డోజర్లు పంపిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రామాలయం పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తుందని, ఆ తర్వాత ఆలయాన్ని కూల్చివేసేందుకు కూడా వెనుకాడదని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ – కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రామ్‌లల్లాను బలహీనపరుస్తారని విమర్శలు గుప్పించారు.
‘‘కాంగ్రెస్‌కు దేశం పట్ల బాధ్యత లేదు. కుటుంబం, అధికారం కోసమే వాళ్లు పనిచేస్తారు. దేశ విభజనకు కూడా కాంగ్రెస్‌దే బాధ్యత. స్వాతంత్య్రం పొందే సమయంలో దేశం విడిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ కాంగ్రెస్ ఈ దేశాన్ని విడగొట్టింది. స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న సమయంలో దేశాన్ని విభజించాలనే చర్చ వచ్చినప్పుడు, అందరూ ఆశ్చర్యపోయారు. దేశాన్ని విభజించవచ్చా? అది కూడా జరుగుతుందా..? అని నిర్ఘాంతపోయారు. కానీ కాంగ్రెస్ దేశాన్ని విడగొట్టి చూపించింది. వారి ట్రాక్ రికార్డు అలాంటిది’’ అంటూ కాంగ్రెస్‌పై, ఇండియా కూటమిపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.