మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో ఉగాది మిలన్
దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిర్వహించిన ఉగాది వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకయ్య నాయుడి అధికారిక నివాసంలో ఉగాది మిలన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉషారాణి, కుమార్తె దీపావెంకట్ సహా ఇతర కుటుంబ సభ్యులకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాదిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలను ప్రధానమంత్రి ఆసక్తిగా తిలకించారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ధన్కడ్, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, మాజీ రాష్ట్రపతి కోవింద్, మాజీ సీజేఐ ఎన్.వి.రమణ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.













