80 కోట్ల మందికి దీపావళి వరకూ ఉచిత రేషన్ : మోదీ ప్రకటన

కరోనా సెకండ్ వేవ్ కుటుంబాలను కకావిలకం చేసేసింది. దేశ ఆర్థిక వ్యవస్ధను, కుటుంబాల ఆర్థిక వ్యవస్థను కకావికలం చేసేసింది. పేదలు జీవించడమే మహా గగనమై కూర్చుంది. ఈ నేపథ్యంలో పేదల కుటుంబాలకు ప్రధాని మోదీ భారీ ఊరట కల్పించారు. కరోనా నేపథ్యంలో ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ అన్న పథకాన్ని దీపావళి పర్వదినం వరకూ పొడిగిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పథకం వల్ల 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందుతుందని, వారి కడుపులు నిండుతాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కరోనా మొదటి వేవ్ సమయంలోనూ ఈ పథకాన్ని కొన్ని నెలల పాటు అమలు చేశామని, పేదలకు ఉచితంగా రేషన్ అందించామని గుర్తు చేశారు. ఎవరూ ఆకలితో బాధపడకూడదని, పస్తులుండకూడదన్నదే తమ అభిమతమని, అందుకే ఈ పథకాన్ని దీపావళి వరకూ పొడిగిస్తున్నట్లు మోదీ వివరించారు.
100 ఏళ్లలో ఇదే మహా విషాదం : మోదీ
వందేళ్లలో వచ్చిన అతిపెద్ద మహమ్మారి కరోనాయే అని మోదీ పేర్కొన్నారు. గతంలో ఇలాంటిది చూడలేదని అన్నారు. ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత ఘోరమైన విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కరోనా వచ్చిన నేపథ్యంలో వైద్య రంగం బలోపేతమైందని, రెండో వేవ్ సందర్భంగానే ఆక్సిజన్ డిమాండ్ విపరీతంగా పెరిగిందని అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి డిమాండ్ రాలేదని, విమానాలు, రైళ్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్‌ను సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మోదీ తెలిపారు.
ప్రపంచానికి భారత్ శక్తి చూపించాం : ప్రధాని
కరోనా కారణంగా స్వదేశీ వ్యాక్సిన్లను తయారు చేశామని, ఇలా తయారు చేసి, ప్రపంచానికి భారత్ శక్తి ఏమిటో చూపించామని సంతోషం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్ ఉత్పత్తి మరింత వేగవంతం అవుతుందని, వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలతో సమానంగా పోటీపడ్డామని, మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి వ్యాక్సిన్‌ను తయారు చేశారని అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే సంస్థలు తక్కువే ఉన్నాయని, వారి అవసరాలు తీరాక, టీకాలు దేశానికి రావడానికి కాస్త సమయం పట్టేదన్నారు. ప్రస్తుతం దేశంలో ఆరు కంపెనీలు టీకాలు ఉత్పత్తి చేస్తున్నాయని, మరో మూడు కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నాయని మోదీ వెల్లడించారు. టీకా తయారీ సంస్థలకు కేంద్రం అన్ని రకాలుగా సహకరించిందని, క్లినికల్ ట్రయల్స్‌కు కూడా పూర్తిగా మద్దతుగా నిలిచామని వివరించారు. వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్లే టీకాలు వచ్చాయని మోదీ ప్రకటించారు.