ఢిల్లీ కోర్టులో కవితకు మళ్లీ షాక్.. 3 రోజుల పాటు సీబీఐ కస్టడీ!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ స్పెషల్ కోర్టు మరోసారి షాకిచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు గురువారం కొట్టివేసింది. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఒకటి.. తన అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేయగా, మరొకటి తనపై సీబీఐ విచారణను ప్రశ్నిస్తూ దాఖలు చేశారు. అయితే ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన స్పెషల్ కోర్టు.. ఆమెను అరెస్ట్ చేయడం సరైందేనని, అలాగే ఆమెను ప్రశ్నించే అధికారం సీబీఐకి ఉందని పేర్కొంది.
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఇటీవల తీహార్ జైలులో ఉన్న ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది.ఈ క్రమంలోనే కవితను ఇంకా ప్రశ్నించాల్సి ఉందని, ఆమెను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపు వాదనలు విన్న స్పెషల్ కోర్టు.. 5 రోజులు కాకుండా 3 రోజులపాటు కవితను సీబీఐ కస్టడీకి అప్పగించడానికి అంగీకరించింది.













