తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ నగారా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలకు పదవీకాలం ముగిసింది. వీటికి నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 17న పరిశీలన జరగనుంది. 22న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్ 29న పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోము వీర్రాజు, చిన్న గోవిందరెడ్డి దేవసాని, మహ్మద్ షరీప్ పదవీకాలం మే 31 నాటికి ముగిసింది. తెలంగాణలో ఆకుల లలిత, మహ్మద్ ఫరూదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బొడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి పదవీకాలం జూన్ 3 నాటికి ముగిసింది. ఈ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది.













