కేంద్ర కేబినెట్ లోకి రామ్ మాధవ్, మురళీధర్ ?
తెలుగు రాష్ట్రాలకు చెందిన రామ్ మాధవ్, మురళీధర్ రావుకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కనున్నట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ తాజాగా జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మందికి జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. అయితే, ఇన్నాళ్లు జాతీయ కార్యదర్శులుగా ఉన్న తెలుగు రాష్ట్రాల సీనియర్ నేతలు రామ్ మాధవ్, మురళీధర్ రావును పక్కన పెట్టయడంపై ఇంటా బయటా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముందు నుంచీ పార్టీకి విధేయులుగా సేవలు చేస్తున్నవారిని ఎందుకూ దూరం పెట్టారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అనూహ్యంగా వారికి ప్రమోషన్ లభిస్తున్నట్లు సమాచారం.
రామ్ మాధవ్, మురళీధర్ రావుకు ప్రధాని మోదీ కేబినెట్లో మంత్రులుగా అవకాశం ఇవ్వనున్నట్టు కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. అందుకనే జాతీయ కార్యదర్శులుగా తప్పించారనేది ఆ వార్తల సారంశం. అంతర్జాతీయ వ్యవహారాలపై పట్టు ఉన్న రామ్ మాధవ్‌కు విదేశాంగ శాఖ, వ్యాపార వ్యవహారాల్లో అనుభవం ఉన్న మురళీధర్ రావుకు వాణిజ్య శాఖలు కేటాయిస్తారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీకి చాలా కాలంగా సేవలు చేస్తున్న ఈ ఇద్దరికీ కీలక పదవులు దక్కడం ఖాయమని కొందరు బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.













