ప్రధాని మోదీకి సూచనలతో కూడిన లేఖ రాసిన మాజీ ప్రధాని మన్మోహన్
దేశంలో కరోనా సంక్రమణంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ మన్మోహన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. ఆ లేఖలో కొన్ని సలహాలను కూడా ఇచ్చారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషనే ప్రధానమని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ సంఖ్యపై దృష్టి సారించకుండా, ఇంకా ఎంత మందికి వ్యాక్సిన్ వేయాలన్న అంశంపై దృష్టి నిలిపాలని పేర్కొన్నారు. రాబోయే ఆరు నెలల్లో టీకా ఎంత మందికి ఇవ్వాల్లో నిర్దేశించుకోవాలని, ఆ లక్ష్యానికి తగ్గట్టుగా తయారీ సంస్థలకు ఆర్డర్లు కూడా ఇవ్వాలన్నారు.
ఇలా ముందుగానే ఆర్డర్లను ఇస్తే, సకాలంలో అన్ని రాష్ట్రాలకూ పంపిణీ క్రమ పద్ధతి ప్రకారం జరుగుతుందని ఆశించారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లను బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. అయితే వ్యాక్సినేషన్లను రాష్ట్రాలకు ఎలా పంపిణీ చేస్తారో పారదర్శకంగా చెప్పాలన్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తిన సమయంలో వాడడానికి కేంద్ర వద్ద 10 శాతం వ్యాక్సిన్లను ఉంచుకోవచ్చని, మిగిలిన టీకాలను రాష్ట్రాలు తమ ప్రణాళిక ప్రకారం వాడుకునేలా కేంద్రం అనుమతించాలని మన్మోహన్ సూచించారు.
కోవిడ్ యోధులను వివిధ వర్గాలుగా వర్గీకరించే స్వేచ్ఛను రాష్ట్రాలకే ఇవ్వాలన్నారు. 45 ఏళ్ల వయస్సు లోపు వారికి కూడా అవసరమైతే వ్యాక్సినేషన్ చేయడానికి రాష్ట్రాలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, బస్సులు, ట్యాక్సీల డ్రైవర్లు, పంచాయతీ సిబ్బంది, కోర్టులకు వెళ్లే న్యాయవాదులను ఫ్రంట్లైన్ వర్కర్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణించవచ్చునని అన్నారు. వారికి 45 సంవత్సరాలు నిండకున్నా, టీకాలు వేయాలని మన్మోహన్ లేఖలో పేర్కొన్నారు.
మన దేశంలో టీకా పంపిణీ తక్కువ మోతాదులో ఉన్నందున యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ లేదా యూఎస్ఎఫ్డీఏ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి గ్రీన్ సిగ్నల్ పొందిన టీకాలకు మన దేశంలో కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నారు. టీకా ఉత్పత్తిదారులకు కేంద్రం కావల్సిన రాయితీలను కల్పించాలని, తద్వారా మానుఫ్యాక్చరింగ్ యూనిట్లను విస్తరించేందుకు తోడ్పడాలని సూచించారు. చట్టంలోని నిర్బంధ లైసెన్సింగ్ నిబంధనలను వినియోగించాల్సిన సమయం వచ్చిందని, లైసెన్స్ ఉంటే వ్యాక్సిన్లను తయారు చేసే కంపెనీలు చాలా ఉన్నాయని మన్మోహన్ లేఖలో పేర్కొన్నారు.













