మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట
ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. ఢిల్లీ కోర్టు ఆయనకు మూడు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. తన తోబుట్టుకు కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు కోర్టు నుంచి ఈ ఉపశమనం దక్కింది. మద్యం కుంభకోణం కేసులో సిసోడియా ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సీబీఐ, ఈడీ ఆయన్ను విచారిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కస్టడీపై తిహార్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చిది. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతోన్న తన భార్యను వారానికి ఒకసారి పరామర్శించేందుకు కొద్దిరోజుల క్రితం ఢిల్లీ కోర్టు సిసోడియాకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన భార్య ఆటోఇమ్యూన్ డిజార్డర్, మల్టిపుల్ స్ల్కెరోసిస్ అనే అరుదైన సమస్యలతో బాధపడుతున్నారు.













