అంతర్జాతీయ కవి సమ్మేళానాన్ని ప్రారంభించిన మండలి బుద్ధప్రసాద్

తెలుగు భాష పరిరక్షణ బాధ్యతను రాష్ట్రేతర తెలుగు వారంతా బాగా నిర్వహిస్తున్నారని ఆంధప్రదేశ్ శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య (రాతెరా) అయిదో వార్షికోత్సవం సందర్భంగా కరోనా మహమ్మారి అంశంపై అంతర్జాతీయ స్థాయి కవి సమ్మేళనం నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో (దృశ్యశ్రవణ మాధ్యమం) చేపట్టారు. తొలుత జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ రాతెసతో అనకున్న అనుబంధాన్ని వివరించారు.
రాతెస జాతీయ నిర్వాహక అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరావు అధ్యక్షోపన్యాసనం చేశారు. అంతర్జాతీయ తెలుగు సంస్థలతో రాతెస మరింత సమన్వయాన్ని పెంచుకుని, ముందుకు సాగేందుకు కృషి చేస్తుందన్నారు. సమావేశంలో మూర్తిదేవి పురస్కార గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్, తెలుగు సినీ రచయిత భువనచంద్ర, ప్రపంచ రచయితల సంఘం కార్యదర్శి జి.వి.పూర్ణచందు మాట్లాడారు. రాతెస జాతీయ ప్రధాన కార్యదర్శి పి.వి.పి.సి ప్రసాద్ వందన సమర్పణ చేయగా ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.











































































