మూడోసారి ముఖ్యమంత్రిగా దీదీ ప్రమాణం… రాజధర్మం పాటించాలని గవర్నర్ సలహా

బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత సాదాసీదాగా జరిగిపోయింది. అతి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో పాటు టీఎంసీ సీనియర్ నేతలు పార్థా ఛటర్జీ, సుబ్రతా ఛటర్జీ, అభిషేక్ బెనర్జీ పాల్గొన్నారు. మమతా బెనర్జీ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. మిగితా వారెవరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయలేదు.
రాజధర్మం పాటించండి : గవర్నర్ సూచన
ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడియే తమ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న హింసను ఏమాత్రం ఉపేక్షించమని, కారకులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన రాగానే గవర్నర్ ధన్కర్ కూడా స్పందించారు. రాష్ట్రం రాజ్యాంగబద్ధంగా జరగాలని, రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాన్ని నడుపుతారని తాము ఆశిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. అయితే మళ్లీ గవర్నర్ వ్యాఖ్యలకు మమత స్పందించారు. ఇప్పటి వరకూ ఎన్నికల కారణంగా అంతా ఎన్నికల కమిషన్ పరిధిలో ఉందని, అధికారులను బదిలీ చేశారని గుర్తు చేశారు. ఇప్పడు ప్రమాణ స్వీకారం పూర్తైందని, వ్యవస్థను అంతా గాడిలో పెడతానని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.