సీబీఐ కార్యాలయం ఎదుట మమత ధర్న

పశ్చిమ్ బెంగాల్‍లో సంచలనం సృష్టించిన నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‍కతాలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. నిబంధనలకు అనుగుణంగా వారి అరెస్టులు జరగలేదు. నన్ను కూడా అరెస్టు చేయండి అంటూ ఆమె అరెస్టులను తీవ్రంగా వ్యతిరేకించారు. దాదాపు ఆరు గంటలపాటు సీబీఐ కార్యాలయం నిజాం ప్యాలెస్ ఎదుట కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. మంత్రుల అరెస్టుకు వ్యతిరేకంగా టీఎంసీ కార్యకర్తలు భారీ ఎత్తున సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకుని, బ్యారికేడ్లు, తొలగించడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కార్యకర్తలను చెదరగొట్టాడానికి రంగంలోకి దిగిన పారామిలిటరీ సిబ్బంది, పోలీసులపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఇప్పటికే పలు అంశాల్లో కేంద్రం, దీదీ మధ్య ఢీ అంటే ఢీ వాతావరణం నెలకొని ఉండగా తాజా వ్యవహారం అందుకు ఆజ్యం పోసేలా కనిపిస్తోంది.
ఈ ఘటనపై గవర్నర్ జగదీప్ ధన్‍ఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారున. టీఎంసీ కార్యకర్తలు అన్యాయంగా ప్రవర్తిస్తూ, అరాచకాలకు ప్పాడుతున్నారని, రాజ్యాంగ నియమాలను పాటించాలని కోరారు. ఈ ఘటనపై మమత బెనర్జీ అల్లుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ బెంగాల్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని అన్నారు. లాక్‍డౌన్ నియమాలను ఉల్లంఘించి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, చట్టబద్ధంగానే ఈ యుద్ధం కొనసాగుతుందని తెలిపారు.