ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసిన దీదీ

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. నేడు తృణమూల్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మమతను శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 5న ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేస్తారని తృణమూల్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అత్యంత సాధారణంగానే జరుపుతామని ప్రకటించారు. కరోనాను కట్టడి చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని, దానిని కట్టడి చేసేంత వరకూ ఎలాంటి ఉత్సవాలూ జరపమని టీఎంసీ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 292 నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించగా, ఏకంగా 213 సీట్లను కైవసం చేసుకుంది. 77 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.