చేతులెత్తి నమస్కరిస్తున్నా…. పోలింగ్ కుదించండి : దీదీ
బెంగాల్ ఎన్నికల పోలింగ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందన్న ఈసీ తన ప్రకటనను పునః సమీక్షించుకోవాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ‘‘చేతులు జోడించి వేడుకుంటున్నా. మిగతా మూడు దశల ఎన్నికలను ఈసీ ఒకే దశలో నిర్వహించాలి. ఒక రోజు కుదరకపోతే రెండు రోజుల్లో పోలింగ్ పూర్తి చేయండి. ఒక రోజు ముందైనా ముగించండి’’ అంటూ మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. చివరి మూడు దశల ఎన్నికలను ఒకటి లేదా రెండు రోజులకు కుదించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి మరింత వ్యాప్తిచెందకుండా నిరోధించగలిగిన వారమవుతామని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ చెప్పినట్లు నడుచుకోవద్దని, పోలింగ్ షెడ్యూల్‌ను కుదిస్తే ప్రజల ప్రాణాలు కాపాడిన వారమవుతామని వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే తాము ఈ అభ్యర్థనను చేస్తున్నామన్నారు.
ప్రధాని రాజీనామా చేయాలి : మమతా
కరోనా సెకండ్ వేవ్‌ను నియంత్రించడంలో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని దీదీ మండిపడ్డారు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేయాలని మమత డిమాండ్ చేశారు. ఆరోగ్య ఎమర్జెన్సీని ఎదుర్కోడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. మొదటి వేవ్ సెప్టెంబర్‌లో తగ్గుముఖం పట్టిందని, కాస్త సమయం లభించిందని, అయినా సరే సెకండ్ వేవ్‌ను ఎదుర్కోడానికి ఏమాత్రం సంసిద్ధం కాలేదని మండిపడ్డారు. ఆక్సిజన్ కొరత, టీకాల కొరత ఆయా రాష్ట్రాలను వేధిస్తోందని, ఈ సమస్యను అధిగమించడానికి మోదీ చేసిందేమీ లేదని మమత దుయ్యబట్టారు.













