‘భూమి పుత్రుడు’ అన్న నినాదాన్ని ఎత్తుకున్న తృణమూల్… అదే రీతిలో స్పందిస్తున్న బీజేపీ
‘అవుటర్స్’ అన్న నినాదానికి అధికార తృణమూల్ మరింత పదును పెట్టింది. ఇప్పటి వరకూ ఇదే నినాదంతో బీజేపీని ఇరుకున పెడుతూ వస్తోన్న తృణమూల్… ఇకపై ఈ నినాదాన్ని అధికారికంగా ఎన్నికల్లో వాడాలని, విస్తృత ప్రచారంలోకి తేవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే పార్టీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆవిష్కరించింది. ‘భూమి పుత్రుడినే ప్రజలు కోరుకుంటున్నారు.’ అని ఆ పోస్టర్ మీద ఉంది. బెంగాల్ బిడ్డనే ప్రజలు కోరుకుంటున్నారని తృణమూల్ నేతలు పేర్కొంటున్నారు. ఎన్నికల సందర్భంగా ఇదే ప్రధాన అంశంతో తృణమూల్ బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యింది. ‘‘కొన్ని సంవత్సరాలుగా సీఎంగా ఉంటూ ప్రజల పక్షాన ఉన్న బెంగాల్ బిడ్డనే ప్రజలు తిరిగి కోరుకుంటున్నారు. మాకు అవుట్ సైడర్స్ అవసరమే లేదు. అలాంటి వారిని ప్రజలు కోరుకోవడం లేదు.’’ అని తృణమూల్ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీ పేర్కొన్నారు.
బెంగాల్‌పై బీజేపీ కన్ను పడి, అగ్రనేతలు తరచూ బెంగాల్ పర్యటిస్తున్న నేపథ్యంలో తృణమూల్ అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటిస్తున్న నేపథ్యంలో సీఎం మమత ‘అవుట్ సైడర్స్’ అన్న నినాదాన్ని ఎత్తుకున్నారు. బెంగాల్ సంస్కృతి, బెంగాల్ వారసత్వ సంపద విషయంలో బీజేపీకి ఏమాత్రం అవగాహ లేదని, ఎవరి విగ్రహాలో కూడా గుర్తు పట్టకుండా పూల మాలలు వేసేస్తారంటూ పరోక్షంగా సీఎం మమత అమిత్‌షా పై విరుచుకుపడుతున్నారు. అవుట్ సైడర్స్కి ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే లేదని మమత పదే పదే విమర్శిస్తున్నారు. ‘‘అవుట్ సైడర్స్‌కు బెంగాల్లో స్థానం లేదు. వారు ప్రేమిస్తున్నది మా ప్రజల్ని. బెంగాలీలంతా మా వారే. ఎన్నికల ముందు మతపరమైన ఇబ్బందులను సృష్టించడానికి వస్తున్న వారు కచ్చితంగా అవుట్ సైడర్సే. మరొకరు కాదు.’’ అంటూ సీఎం మమత విమర్శలు సైతం చేస్తున్నారు. బెంగాల్‌కు వచ్చి గూండాగిరీ చేసే వారు కచ్చితంగా అవుట్ సైడర్సే అని ఆమె కుండ బద్దలు కొట్టారు.
భూమిపుత్రుడే సీఎం అవుతారు : బీజేపీ
‘అవుటర్స్’ పేరుతో ఇరుకున్న పెడుతున్న తృణమూల్‌కు బీజేపీ కూడా గట్టి కౌంటరే ఇస్తోంది. బెంగాల్లో బీజేపీ గనక అధికారంలోకి వస్తే కచ్చితంగా బెంగాలీ బిడ్డే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారని బెంగాల్ వ్యవహరాలను పర్యవేక్షిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చాలా సార్లు ప్రకటించారు. ‘‘ఎన్నికల్లో గెలిస్తే బెంగాలీ భూమిపుత్రుడే సీఎం అవుతారు. ఈ విషయం ఇప్పటికే 25 సార్లు ప్రకటించారు. సీఎం మమత కావాలనే ప్రజలను విభజిస్తున్నారు. ఇలా చేస్తే బెంగాలీ సంస్కృతి సీఎం మమతకే తెలియదన్నట్లు.’’ అని బీజేపీ రివర్స్ కౌంటర్ ఇస్తోంది.













