ఎత్తుకు పై ఎత్తు వేసిన మమత… అనుకున్నది సాధించిన సీఎం

బెంగాల్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల సమయం నుంచి సీఎం మమత కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. తాజాగా సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్ విషయంలో కేంద్రంపై మమతా బెనర్జీ పై చేయి సాధించారు. సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్‌ను ఢిల్లీకి పంపాలని కేంద్ర ప్రభుత్వం సీఎం మమతా బెనర్జీని ఆదేశించింది. అందుకు మమతా ససేమిరా ఒప్పుకోలేదు. తాను పంపనని కేంద్రానికి లేఖ రాశారు. ఈ ఊగిసలాట నడుస్తున్న సమయంలోనే కేంద్రానికి సీఎం మమతా ఝలక్ ఇచ్చారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న ఆలాపన్ బందోపాధ్యాయ్‌తో మమతా రాజీనామా చేయించారు. ఆయన్ను తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. ఈ పదవిలో ఆయన 3 నెలల పాటు కొనసాగనున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి ఆయన పనిచేస్తారని మమత ప్రకటించారు. వాస్తవానికి ఆలాపన్ బందోపాధ్యాయ్ పదవీ కాలం సోమవారంతో ముగుస్తుంది. అయితే ఆయన పదవీ కాలాన్ని 3 నెలల పాటు పొడిగించాలని సీఎం మమతా కేంద్రాన్ని కోరారు. ఈ విషయం తర్వాత ప్రధాని మోదీ యాస్ తుపానుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించగా, ఈ సమావేశానికి అటు సీఎం మమత, ఇటు సీఎస్ ఆలాపన్‌తో సహా ఇతర అధికారులు డుమ్మా కొట్టారు. దీంతో ఆయన్ను కేంద్ర సర్వీసులకు పంపాలని సీఎం మమతను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
నూతన సీఎస్‌గా హరికృష్ణ ద్వివేదీ
సీఎస్‌గా బాధ్యతల్లో ఉన్న ఆలాపన్ బందోపాధ్యాయ పదవీ కాలం సోమవారంతో ముగిసింది. దీంతో తదుపరి సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ హరికృష్ణ ద్వివేదీని నియమిస్తున్నట్లు సీఎం మమత ప్రకటించారు. ద్వివేదీ ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతల్లో వున్నారు. ఆయనే తదుపరి సీఎస్‌గా కొనసాగనున్నారు.
ప్రధానికి లేఖ రాసిన సీఎం మమత
తమ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీని ఢిల్లీకి పంపించేది లేదంటూ ప్రధాని మోదీకి మమతా బెనర్జీ లేఖ రాశారు. యాస్ తుపానుపై మోదీతో జరిగిన సమావేశానికి సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్ హాజరు కాలేదు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం… ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. లెక్క ప్రకారం సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్ సోమవారం ఢిల్లీకి వెళ్లి, విధుల్లో చేరాల్సి ఉంది. కానీ ఆయనను రిలీజ్ చేసేది లేదని మమత భీష్మించుకొని కూర్చున్నారు. కేంద్రం ఏపక్షంగా తీసుకున్న నిర్ణయమని, తనను షాక్‌కు గురి చేసిందని మమత లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్‌ను రిలీవ్ చేయడం కుదరదని మమత తెగేసి చెప్పారు. బందోపాధ్యాయ్ రాష్ట్రంలోనే కొనసాగుతారని, కోవిడ్ సంక్షోభ నిర్వహణను చూసుకుంటారని మమత లేఖలో పేర్కొన్నారు.