బీజేపీ ఎన్ని కుతంత్రాలు చేసినా.. మళ్లీ గెలిచేది మేమే: మమతా బెనర్జీ
West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ రేపుతున్న తరుణంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక కీలక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఫలితాల సరళిపై స్పందిస్తూనే, బీజేపీ అనుసరిస్తున్న తీరుపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాజకీయ చిత్రం మారుతుందని..
లెక్కింపు ప్రక్రియలో ఇప్పటివరకు కేవలం మూడు రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయని, ప్రారంభ ట్రెండ్స్ చూసి ఎవరూ ఆందోళన చెందవద్దని దీదీ తన మద్దతుదారులకు ధైర్యం చెప్పారు. ఇంకా చాలా రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉందని, లెక్కింపు పూర్తయ్యేసరికి రాజకీయ చిత్రం మారుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ఓట్ల దొంగతనంపై ఆరోపణలు..
‘SIR’ సాకుతో బీజేపీ లక్షలాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించిందని మమత ఆరోపించారు. ముఖ్యంగా మైనారిటీలు, మతువా, రాజ్బన్షీ సామాజిక వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని ఈ ‘ఓట్ల దొంగతనం’ జరిగిందని విమర్శించారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆమె స్పష్టం చేశారు.
టీఎంసీ ఏజెంట్లు బయటకు రావొద్దని..
కౌంటింగ్ కేంద్రాల నుంచి టీఎంసీ ఏజెంట్లు ఎవరూ బయటకు రావొద్దని మమతా బెనర్జీ ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సహనం కోల్పోకుండా తుది ఫలితం వరకు అక్కడే ఉండాలని సూచించారు.
మమత ధీమా..
బీజేపీ ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా బెంగాల్ ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ వైపే ఉన్నారని, అంతిమంగా తామే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మమత ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం బెంగాల్లో కౌంటింగ్ కొనసాగుతుండటంతో అటు అధికార టీఎంసీ, ఇటు ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరి రాజకీయ వేడిని పెంచుతోంది.








