బీజేపీ పాలన ట్రైలరే ఇలా ఉంటే.. సినిమా ఇంకెంత దారుణంగా ఉంటుందో: ఖర్గే

దేశంలో బీజేపీ 10 ఏళ్ల పాలన కేవలం ట్రైలరేనంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 10 సంవత్సరాల మోదీ ట్రైలర్‌లో గ్యాస్ సిలిండర్, పెట్రోల్-డీజిల్, నిత్యావసరాల ధరలన్నీ పెరిగిపోయాయని, రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరిగిందని, పేదరికం పెరిగిపోతోందని ఖర్గే విమర్శించారు. మరి మోదీ పాలన ట్రైలరే ఇలా ఉంటే ఇక సినిమా ఇంకెంత దారుణంగా ఉంటుందో ప్రజలే అర్థం చేసుకోవాలని సూచించారు. ‘‘గ్యాస్ సిలిండర్ రూ. 1200కు చేరుకుంది. పెట్రోల్-డీజిల్ ధర రూ. 100 రూపాయలు దాటేసింది. 45 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ భారీస్థాయిలో నిరుద్యోగం పెరిగింది. 100 ఏళ్ల గరిష్ఠ స్థాయికి పేద, ధనిక వ్యత్యాసం పెరిగింది. మోదీ జీ ట్రైలరే ఇలా ఉంటే.. ఇక సినిమా ఎలా ఉంటుందో? ఇక ముందు కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో మీరే ఆలోచించండి. అదే జరిగితే.. గ్యాస్ సిలిండర్‌కు రూ.4000, పెట్రోల్-డీజిల్‌కు రూ.400 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది’’ అంటూ మోదీ సర్కార్‌పై ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు.