సీఎం అభ్యర్థిని నిర్ణయించేది వాళ్లే: మల్లికార్జున ఖర్గే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖరారైంది. దీంతో ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై తీవ్రమైన చర్చ సాగుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. సీఎంగా ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు అద్భుతంగా పనిచేశాయని, రాష్ట్రంలో బీజేపీ దుష్ట పాలనకు ప్రజలు ఇలా ముగింపు పలికారని చెప్పారు.
కొత్తగా గెలిచిన కాంగ్రెస్ నేతలంతా సాయంత్రంలోగా బెంగళూరు చేరుకోవాలని ఆదేశించామని, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన తగిన విధానాలను పార్టీ అనుసరిస్తుందని స్పష్టం చేశారు. నేతలంతా బెంగళూరు చేరుకున్న తర్వాత వారికి కీలకమైన సూచనలు చేస్తామని, ఆ తర్వాత హైకమాండ్ నుంచి పరిశీలకులు అక్కడకు చేరుకుంటారని వివరించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలియజేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ప్రజల విజయమని చెప్పిన ఆయన.. ప్రత్యర్థి బీజేపీ కంటే స్పష్టమైన ఆధిక్యం రావడం ప్రజల ఘనతే అని కొనియాడారు. ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇచ్చారని, దుర్మార్గపు పరిపాలనకు వ్యతిరేకంగా.. బీజేపీపై కోపంతో తమకు ఓటు వేశారన్నారు. కర్ణాటక ఓటర్లు అంతా గమనిస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, డజన్ల కొద్దీ మంత్రులు, ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల మంత్రులు కూడా వచ్చి ఇక్కడ క్యాంప్ వేసుకుని, అంగబలం, ధనబలం, కండబలం ఉపయోగించారని.. కానీ ప్రజలు మాత్రం కలిసికట్టుగా కాంగ్రెస్‌కే పట్టం కట్టారని పేర్కొన్నారు.













