మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు.. కేంద్రంలో వచ్చేది
2024 ఎన్నికల్లో బీజేపీని గద్దెదింపుతూ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. నాగాలాండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందన్నారు. కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళతామని అన్నారు. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్న ఆయన ప్రజలే బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వస్తుందని అన్నారు. తమ పార్టీ ఇతర పార్టీలతో చర్చలు జరుపుతోందని వెల్లడించారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేకుండా పోతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాదని, కాంగ్రెస్, మిత్రపక్షాలన్నీ కలిస్తే మెజారిటీ సాధిస్తుందని పేర్కొన్నారు. 100 మంది మోదీలు, అమిత్ షాలు వచ్చినా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఖర్గే స్పష్టం చేశారు.













