జూదానికి మద్ధతా? సెలబ్రిటీలూ..
డబ్బు యావ, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆరాటం తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టకుండా వ్యవహరించే సెలబ్రిటీలకు మరోసారి తమిళనాడు హైకోర్టు షాకిచ్చింది. ఆన్లైన్ జూదానికి మద్ధతుగా ప్రకటనల్లో కనిపించిన పలువురు సినీ, క్రీడా సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చింది.
యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఆన్లైన్ గేమింగ్ యాప్ లను బ్యాన్ చేయాలని, అలాగే ఈ యాప్‌లను వెబ్సైట్లను నిర్వహిస్తున్నవారితో పాటు ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై కఠినమైన చర్యలు చేపట్టాలని కోరుతూ చెన్నైకి చెందిన న్యాయవాది ఎపీ సూర్యప్రకాష్ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన మద్రాస్ హైకోర్టు ఈ మేరకు సెలబ్రిటీలకు తాఖీదులు జారీ చేసింది.ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కి సంబంధించి ప్రమోట్ చేస్తున్న ఆరోపణలతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ ప్రముఖులు రానా, ప్రకాశ్ రాజ్, తమన్నా, సుదీప్ లు ఈ నోటీసులు అందుకున్నారు.
ఆన్ లైన్ గేమింగ్‌కి ఎంతో మంది యువత బానిసలుగా మారుతున్నారని, డబ్బులు పోగొట్టుకుంటున్నారనీ పిటిషన్ లో పేర్కొన్నారు. తాజాగా అధిక వడ్డీలకు అప్పులు చేసి మరీ ఈ జూదాలు ఆడి తిరిగి కట్టలేక కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని పిటిషనర్ సోదాహరణంగా కోర్టుకు తెలిపారు. దీన్ని విచారించిన కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలను సంధించింది. ఆన్ లైన్ జూదానికి సంబంధించిన డబ్బు ఎక్కడకు పోతుందని ప్రశ్నించింది. తెలంగాణలో ఆన్ లైన్ జూదాన్ని నిషేధించిన విషయాన్ని గుర్తు చేసి తమిళనాడులో అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? అని అడిగింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ నిషేధంపై పది రోజుల్లో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.
గతంలోనూ ఎన్నో మార్లు సెలబ్రిటీల వ్యాపార ప్రకటనలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సెలబ్రిటీలు తమ పంథా మార్చుకోకపోవడం విచారకరం. ఆన్‌లైన్‌కు సంబంధించి అనేక ఇతర అంశాలలానే ఆన్లైన్ గేమింగ్‌పై కూడా పటిష్టమైన చట్టాలు ఇంకా రూపుదిద్దుకోని పరిస్థితుల్లో సెలబ్రిటీలు ఇక నుంచైనా తాము ప్రమోట్ చేసే ఆన్లైన్ సంస్థలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.













