ఉదయనిధి స్టాలిన్ కు హైకోర్టులో ఊరట
డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు స్వల్ప ఊరట లభించింది. సనాతన ధర్మంపై వ్యాఖ్యల వివాదంలో ఆయనతో పాటు మరో ఇద్దరు నేతలు చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. గతేడాది సెప్టెంబరులో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆయన చట్టసభ సభ్యుడిగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అప్పటి కార్యక్రమంలో పాల్గొన్న పీకే శేఖర్ బాబు, స్టాలిన్ వ్యాఖ్యలు సమర్థించిన ఎంపీ ఎ.రాజా పేర్లను అందులో చేర్చారు. ఈ విచారణ వేళ కోర్టు మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టింది. అయితే ఇంతవరకు ఆయన దోషిగా తేలలేదని గుర్తు చేసిన న్యాయస్థానం ఆ పిటిషన్ తోసిపుచ్చింది.













