మహారాష్ట్రలో లాక్డౌన్? ప్రకటించనున్న సీఎం ఉద్ధవ్!
మహారాష్ట్ర సర్కార్ లాక్డౌన్ విధించే దిశగా సాగుతోంది. ఇన్ని రోజుల పాటు లాక్‌డౌన్‌పై దాగుడుమూతలు ఆడిన ఉద్ధవ్ సర్కార్… ఇక లాక్‌డౌనే శరణ్యమని భావించినట్లు సమాచారం. మహారాష్ట్రలో కరోనా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే వారంతపు లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ కూడా విధించారు. తాజాగా మరికొన్ని కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శనివారం అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చారు. అన్ని పార్టీల నేతలతో కోవిడ్ పరిస్థితిపై సీఎం చర్చించనున్నారు. అయితే ఉద్ధవ్ సర్కార్ లాక్డౌన్ విధిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. కరోనా కట్టడిలో భాగంగా సీఎం ఉద్ధవ్ లాక్డౌన్ ప్రకటించనున్నారని సమాచారం. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లాక్డౌన్ భయంతో సొంత రాష్ట్రాల బాటపట్టారు. మరోవైపు ముంబై వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. కరోనా కట్టడిలో భాగంగా సర్కార్ వారాంతపు లాక్డౌన్ విధించింది. ఈ లాక్డౌన్ శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. దీంతో ముంబై వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
లాక్డౌన్ పై ముందే ప్రకటించిన మంత్రి
మహారాష్ట్రలో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో భయాందోళన వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో కేసులు వస్తున్నాయని, రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలని మంత్రి విజయ్ వాడెట్టివార్ సలహా ఇచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేస్తారని ఆయన తెలిపారు. కరోనాను కట్టడి చేయడానికి మూడు వారాల పాటు కఠిన లాక్డౌన్ ఉండాలని సూచించారు. ఈ విషయంపై సీఎం అఖిలపక్షం నిర్వహిస్తారని, ఏ విషయమో కుండబద్దలు కొట్టేస్తారని మంత్రి పేర్కొన్నారు.













