ప్రముఖ గణిత శాస్త్రవేత్త డాక్టర్ సీఆర్ రావు ఇకలేరు
ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త, తెలుగు తేజం డాక్టర్ కల్యంపూడి రాధా కృష్ణారావు (102) అమెరికాలో కన్నుమూశారు. ఒక శాస్త్రజ్ఞుడు, అంతకు మించిన గొప్ప ఉపాధ్యాయుడు, కొన్ని తరాలను వెలిగించిన మహనీయుడు ఆయన. భారత ప్రభుత్వం 1986లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. సీఆర్ రావుగా పేరొందిన ఆయన దశాబ్దాల క్రితమే గణాంక శాస్త్రంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజాలు నాటారు. 1945లో కోల్కతాలో మేథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన రావు పరిశోధన పత్రానికి నోబెల్ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2023 అవార్డు వరించింది. ఆయన ఇటీవలే ఆ అవార్డు అందుకున్నారు. సీఆర్ రావు 1920 సెప్టెంబరు 10న కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. తల్లి లక్ష్మీకాంతమ్మ, తండ్రి దొరైస్వామిలకు ఎనమిదో సంతానం. ఆయన బాల్యం ఉమ్మడి కృష్ణా జిల్లా గూడూరు, నూజివీడు, నందిగామలో గడిచింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ గణితం చేసిన తర్వాత 1945లో కోల్కతాలో ఎంఏ స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో 1948లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థిగా చేరి, అదే సంస్థకు డైరెక్టర్గా ఎదిగారు.













